టవర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

టవర్‌ ప్రారంభం

Nov 17 2026 12:38 AM | Updated on Nov 17 2026 12:38 AM

● 14 అంతస్తుల జ్ఞాన మందిర్‌.. నిర్మాణ శైలికి నాలుగు జాతీయ అవార్డులు

శ్రీశ్రీ యూనివర్సిటీ ..

భువనేశ్వర్‌ : కటక్‌లో శ్రీశ్రీ యూనివర్సిటీలో నిర్మించిన ప్రతిష్టాత్మక ‘ఐకానిక్‌ టవర్‌–జ్ఞాన మందిర్‌’ను భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ సోమవారం ప్రారంభించారు. ఒడిశా గవర్నర్‌ బ్రజ్‌మోహన్‌ రామ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, శాశ్వత జ్ఞానం, ఆధునిక విద్యా ఆకాంక్షల సమ్మేళనానికి ఈ టవర్‌ ప్రతీకగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

14 అంతస్తులతో నిర్మాణం

14 అంతస్తులతో నిర్మించిన ఈ ఐకానిక్‌ టవర్‌ శ్రీశ్రీ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విద్యారంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణిస్తున్న ఈ భవనం తన విశిష్ట నిర్మాణ శైలికి ఇప్పటికే నాలుగు జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది. తూర్పు–పడమర సంస్కృతులు, శాస్త్రం–కళల సమ్మేళనంగా దీన్ని రూపొందించినట్లు శ్రీశ్రీ యూనివర్సిటీ వ్యవస్థాపకులు, జీవితకాల అధ్యక్షుడు గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ పేర్కొన్నారు.

విద్యతో వికసిత్‌ భారత్‌ లక్ష్యం

వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థుల్లో జ్ఞానం, నైతిక విలువలు, మానవతా దృక్పథాన్ని పెంపొందించడంలో విద్య కీలకమని ఉపరాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సమాజం పట్ల బాధ్యతాయుతమైన వైఖరికి దోహదపడాలని సూచించారు. ఒడిశాలోని విశ్వవిద్యాలయాలు గిరిజన విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించేందుకు ‘స్కూల్‌ కనెక్ట్‌’ కార్యక్రమాలను ప్రారంభించాలని రాధాకృష్ణన్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా గిరిజన విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించి, మధ్యలోనే చదువు మానేసే పరిస్థితులను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ ప్రసంగించారు. గవర్నర్‌ బ్రజ్‌మోహన్‌ రామ్‌, శ్రీశ్రీ యూనివర్సిటీ వ్యవస్థాపకులు, జీవితకాల అధ్యక్షుడు గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌, యూనివర్సిటీ అధ్యక్షుడు, బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్‌పర్సన్‌ ఆదేష్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement