జయపురం : జయపురంలో నివసిస్తున్న బీహారీ సంప్రదాయ ప్రజలు తమ ప్రధాన ధార్మిక పండగ ఛట్ పూజను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఖజురీ బందు వద్ద పట్టణంలో బీహారీ సంప్రదాయ ప్రజలంతా ఏకమై వారి సంప్రదాయ, ధార్మిక విధి విధానాల ప్రకారం ఛట్ పూజలను భక్తి, శ్రద్ధలతో జరుపుకున్నారు. ఖొజురీ బంద వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా ఛాట్ పర్వ్ ధార్మిక ప్రాధాన్యత, వారి సంప్రదాయాలతో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు సూర్యదేవుని ఆరాధించారు. స్థానిక పంచానన మందిరంలో ఆదివారం రాత్రి సామూహిక ప్రసాద సేవనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, మాజీ మంత్రి రబినారాయణ నందో, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రథ్, కొరాపుట్ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్గా మిశ్ర తదితరులు పాల్గొన్నారు.
బైక్ చోరీ
రాయగడ: స్థానిక న్యూకాలనీలోని ఉమాశంకర్ సినిమా హాల్ సమీపంలో ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న బైక్ చొరీకి గురయ్యింది. ఒడియా వెబ్ చానల్ రిపొర్టర్ సంతోష్ కుమార్ సాహు ఈ మేరకు సదరు పోలీస్ స్టేషన్‌లో తన బైకు చోరీకి గురైనట్లు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎప్పటిలాగే ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై మధ్యాహ్నం ఇంటికి వెళ్లి తన బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేసి లోపలకి వెళ్లాడు. అనంతరం బయటకు వచ్చ చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు భావించి వెంటనే సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతంల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఒక బైకుపై వచ్చి ఒక వ్యక్తి పార్కింగ్ చేసి ఉన్న బైకును దొంగిలించి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీని ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
గాయాలతో చిరుత పులి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి అటవీశాఖ సిబ్బంది అధికారులతో అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా గాయాలతో పడి ఉన్న చిరుత పులి కనిపించింది. వెంటనే దాన్ని పట్టుకుని మెరుగైన వైద్యం కోసం జయపూర్‌లోని ఎస్‌డీవీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో చిరుతకు పైచేయి ఎముక విరిగినట్లు గుర్తించి వెంటనే చిరుతకు వైద్యులు సునీల్ నాయక్, రూపా మిసీ్త్ర, ఆర్.సాయికిరణ్‌తో కూడిన బృందం 8 గంటలు పాటు క్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆధునిక పద్ధతిలో విరిగిన ఎముకను సరిచేశారు. వైద్య బృందం చేసిన శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో మల్కన్‌గిరి అటవీశాఖ అధికారులు చూపిన చొరవకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మల్కన్‌గిరి డీఎఫ్‌ఓ సాయికిరణ్ మాట్లాడుతూ ఈ చిరుతకు ఆరోగ్యం కుదుట పడ్డాకే సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని తెలిపారు.
శివపార్వతుల విగ్రహావిష్కరణ
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి మచ్చమర పంచాయతీ రాజపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన చెరువులో శివపార్వతుల విగ్రహాలను కార్తీకమాసం సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణ రావు సోమవారం ఆవిష్కరించారు. అనంతరం మచ్చమర గ్రామస్తులు అందరికీ అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. కోడూరు నారాయణరావుతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి.


