జయపురం: జయపురం పట్టణంలో క్షీణిస్తున్న శాంతి భధ్రతల పరిరక్షణ, జోరుగా జరుగుతున్న దొంగతనాలు అరికట్టేందుకు అదనపు పోలీసు బలగాలను పెంచాలని జయపురం బీజేడీ నాయకులు డిమాండ్ చేస్తూ జయపురం పట్టణ పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా జయపురం ఎస్‌డీపీఓ అర్చిత మిత్తల్‌కు వినతి పత్రం అందజేశారు. రెండు దినాల కిందట జయపురం లింగరాజ్ నగర్ లో దోపిడీ జరిగిందని, పట్టణంలో గత 6 నెలలుగా దోపిడీలు, దొంగతనాలు, ఇళ్లలో చొరబడి దోపిడీలు, మహిళల మెడలో పుస్తెల తాడులు గొలుసులు తెంపుకు పోయే సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, పెరుగుతున్న నేరాల రేటు పట్టణ ప్రజలను, వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. పోలీసు శాఖ చేస్తున్న కృషిని తాము విస్మరించదలచుకోలేదని వినతి పత్రంలో తెలిపారు. కానీ శాంతిభద్రతలు కుదుట పడాలంటే పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.


