భువనేశ్వర్: ఎన్నికల్లో ఓట్లు సాధించి విజయం పొందుతామని, అయితే ప్రజల గౌరవాన్ని మాత్రం ప్రజాసేవ ద్వారానే సంపాదించగలమని ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ అన్నారు. భువనేశ్వర్‌లో 17వ ఒడిశా శాసనసభ సభ్యుల కోసం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు నిర్మాణాత్మక చర్చలు, సమగ్ర అవగాహనతో కూడిన వాదనలు, శాసన ప్రక్రియలను పాటించడం కీలకమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా శాసన వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. భారత దేశం అనుసరిస్తున్న గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలను శాసనసభ్యులు కాపాడాలని, అభివృద్ధి చెందిన ఒడిశా నిర్మాణానికి కృషి చేస్తూ ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన చర్చలు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. నిర్మాణాత్మక సహకారం దేశ పురోగతికి దోహదపడుతుంది అని ఉపరాష్ట్రపతి అన్నారు. ఒడిశా గవర్నర్ బ్రజ్‌మోహన్ రామ్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, శాసనసభ స్పీకర్ సురమా పాఢీతో పాటు 17వ శాసనసభ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.


