మల్కన్‌గిరి : భగవాన్ బిర్సాముండా 151వ జయంతి పురస్కరించుకుని నవంబర్ 11 నుంచి 22 వరుకు దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 15వ తేదీన మల్కన్‌గిరికి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి రానున్నారు. ఈ రోజు స్థానికి బీజేపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కామి తెలిపారు. అలానే జిల్లా అభివృద్ధి కోసం బిర్సముండా, లక్ష్మణ్ నాయక్, తమ్మదొరా చేసిన త్యాగాల గురించి వివరించారు. 22వ తేదీన లక్ష్మణ్ నాయక్ జయంతిను కూడా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
రాయగడ: స్ధానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ట్రస్టు కార్యాలయంలో బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళదుంపలు తదితరమైన నెలకు సరిపడా వస్తువులు పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. ప్రతినెలా ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను ట్రస్టు నిర్వహిస్తోందని ఆమె తెలిపారు. అదేవిధంగా ఆదివాసీ, హరిజన ప్రాంతం కావడంతో నిరుపేదలైన ఆదివాసీ బాలలను ఉచితంగా ట్రస్టు చదివించడంతో పాటు వారికి ట్రస్టులో భోజన, వసతి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తున్నామని చెప్పారు. ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీధర్ ఆచార్య ఈ ప్రాంతంలో ట్రస్టు ఏర్పాటు చేసి ఎంతోమంది అనాథ పిల్లలతో పాటు నిరుపేద ఆదివాసీలకు ఆశాదీపంగా ఉంటూ వారిని ఆదుకుంటున్నారని ఆమె తెలిపారు.
హోటల్స్‌లో అధికారుల తనిఖీలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న పలు హోటల్స్, ఫుడ్‌స్టాల్స్‌లో ఆహార భద్రత ప్రమాణాల అమలును పరిశీలించేందుకు అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, తయారీ విధానం, పరిశుభ్రత, నిల్వ పరిస్థితులను పరిశీలించారు. హోటల్స్, ఆహార విక్రయ కేంద్రాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆహార పదార్థాలను అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయడం, నిల్వ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత పాటించాలని, వంట గదులను శుభ్రంగా ఉంచాలని, నాణ్యత లేని పదార్థాలు వినియోగించరాదని సూచించారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాకేష్ కుమార్ సాహు, డిప్యూటీ కలెక్టర్ శుభ్రస్నాత్ రవుత్‌లో ఈ తనిఖీలను నిర్వహించారు.
టెక్‌గూడలో ఉచిత వైద్య శిబిరం
మల్కన్‌గిరి: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి టెక్‌గూడ గ్రామం వద్ద ఉన్న నీలాంచల్ సేవాఆశ్రంలో క్యూర్‌వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. తొలిరోజు 400 మందికి కంటి పరీక్షలతో పాటు ఆరోగ్య పరీక్షలను వైద్యు చేపట్టి మందులు అందజేశారు. వైద్య శిబిరాన్ని జిల్లా ప్రత్యేక అభివృద్ధి మండలి ఉపాధ్యక్షురాలు సావిత్రీ పడియమి ప్రారంభించారు. అతిథులుగా ఉత్కళ జర్నలిస్టు ఆశోక్ మిశ్రో, స్వామి మాధవానంద మహారాజ్, దేవప్రసాద్ దాస్, వైద్యులు రూపేష్ డాలీ, రాజీవ్ లోచన్ పాడీ, సంజీవ్ కుమార్ పాల్గొన్నారు.


