పర్లాకిమిడి: నాగుల చవితి, కార్తీక మాసం సందర్భంగా శ్రీజగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు అత్యంత సుందరంగా పూలతో అలంకరించారు. సాయంత్రం భక్తులు కార్తీక దీపాలు వెలిగించగా, అఖండ హారతిని స్వామి వారికి సమర్పించారు. వందలాది భక్తులు విచ్చేసి స్వామివారి హారతిని దర్శించారు. ఈనెల 16 కార్తీక మాసం సందర్భంగా భక్తి గీతాల మెలోడీ కార్యక్రమం మందిరం స్నానఘట్టం వద్ద ఉంటుందని శ్రీజగన్నాథ కమిటీ సభ్యులు తెలియజేశారు.
యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యం
మల్కన్‌గిరి : యువతలో విజ్ఞానం, సృజనాత్మకత, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంతో పాటు ఎన్నికల పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా మల్కన్‌గిరి జిల్లా 147–చిత్రకొండ (ఎస్టీ)అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో వ్యాసరచన, క్విజ్ పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి 147 –చిత్రకొండ అసెంబ్లీ ఎన్నికల నమోదు అధికారి జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.


