జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ పంచాయతీ సమితి కమర గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆ గ్రామ పంచాయతీ మహిళలు స్వయం సహాయక గ్రూపుల మహిళా సభ్యులు నాటుసారా, విదేశీ మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా నేడు ఆందోళన జరిపారు. గత ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అమన్ దియాన్ నేతృత్వంలో వందలాది మంది మహిళలు కర్రలు చేత బట్టి సారా బట్టీలు బంద్ చేయాలని, నాటు సారా, విదేశీ మద్యం అమ్మకాలు నిలుపు చేయాలని నినాదాలు చేశారు. ఈ ఆందోళన ససందర్భంగా వారి తరఫున అమన్ దియాన్ జిల్లా కలెక్టర్‌కు రాసిన వినతి పత్రాన్ని పంచాయతీ అధికారులకు అందజేశారు. తమ పంచాయతీ గ్రామాల్లో నాటు సారాతో పాటు విదేశీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, మద్యాన్ని బహిరంగంగానే అమ్ముతున్న అబ్కారీ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతి గ్రామంలోను విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో యువత బానిసలవుతున్నారని తెలిపారు. తమ కళ్ల ముందే తమ పిల్లలు వ్యసన పరులు అవుతున్నారని, కుటుంబాల్లో అశాంతి నెలకొంటోందని పేర్కొన్నారు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఇప్పటికై నా స్పందించకుంటే మద్యం దుకాణాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు.


