● మరో నలుగురికి గాయాలు
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి టికిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సొరిషొపొదొరొ సమీపంలో ఎదరురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురు తీవ్రగాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో మృతుడు కుచేయిపొదొరొ పంచాయతీలోని దుబుగుడ గ్రామానికి చెందిన మోహన్ మాఝి (21)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం మోహన్ తన బైకుపై ఇద్దరు మహిళలను కూర్చుండబెట్టి కుచేయిపొదొరొ గ్రామం నుంచి తమ సొంత గ్రామమైన దుబుడుగకు తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా మరో బైకుపై తుఫాన్ నాయక్ అనే వ్యక్తి మరొకరితో వస్తుండగా అదుపుతప్పి రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మోహన్ సంఘటన స్థలం వద్దే మృతి చెందగా ఇద్దరు మహిళలతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. అధిక వేగంతో వాహనాలు నడపడంతోనే అదుపుతప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


