రాయగడ: శీతాకాలం కావడంతో రాత్రి వేళల్లో ఇసుక తరలించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, పగటి వేళల్లో ఇసుకను తరలించేందుకు అనుమతి మంజూరు చేయాలని వంశధార ట్రాక్టర్ యజమానుల సంఘం కోరింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిలీప్‌కు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. నిబంధనల ప్రకారం ఇసుక రీచ్‌ల నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఇసుకను తరలించాల్సి ఉంది. అయితే పెరుగుతున్న శీతల గాలుల కారణంగా ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుకను రీచ్‌ల నుంచి తీసుకొస్తున్న సమయంలో శీతల గాలులకు నానా అవస్థలు పడుతున్నారని, ఒక్కోసారి మంచు పూర్తిగా కమ్ముకుపోవడంతో రహదారి కనిపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వినతిపత్రంలో వివరించారు. ఈ సమస్య దృష్ట్యా పగటి వేళల్లో ఇసుకను తరలించేందుకు అనుమతులు మంజూరు చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం పరిశీలించిన సబ్ కలెక్టర్ ఈ విషయం పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పారు.


