రాయగడ: జిల్లాలోని గుణుపూర్–గుడారి అటవీ రేంజ్ పరిధిలోని నైరా సెక్సన్ కన్నపాడు సమీపంలో అటవీ శాఖ అధికారులు చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు తెలియజేసిన వివరాల ప్రకారం డీఎఫ్‌ఓ అన్నాసాహెబ్ అహలే ఆదేశాల మేరకు ఎసీఎఫ్‌లు సచ్చిదానంద సేఠీ, సతీష్ కుమార్ దారువాల ఆధ్వర్యంలో గుణుపూర్,గుడారి అటవీ రేంజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నపాడు ఆలయ పూజారి గౌరిశంకర్ రాణ చిరుతపులి చర్మాన్ని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. అరెస్టయిన నిందితుల్లో పద్మపూర్ సమితి పరిధిలోని డెరిగాం పంచాయతీ కి చెందిన గౌరిశంకర్ రాణాతో పాటు శ్రీరామ్ పాత్రో, విశ్రాంత ఉపాధ్యాయుడు పిలిప్ బిడిక, కంధమాల్ జిల్లా తంజూగియా పదావీధికి చెందిన మరేన్ మల్లిక్‌లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న చిరుతపులి చర్మానికి అధికారులు కొలతలు తీసుకోగా దాని వెడల్పు 107 సెంటీమీటర్లు, పొడవు 250 సెంటీమీటర్లు ఉన్నట్లు అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సచ్చిదానంద సేఠీ తెలిపారు. అయితే ఈ చిరుతపులి ఏ ప్రాంతానికి చెందినది దాని వేట వెనుక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని ఆయన తెలిపారు.


