● సంప్రదాయ విత్తనాల పరిరక్షణకు గవర్నర్ పిలుపు
భువనేశ్వర్: ప్రజలు, ముఖ్యంగా యువత, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని ఒడిశా గవర్నర్ బ్రజమోహన్ రామ్ పిలుపునిచ్చారు. చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రజారోగ్యంతోపాటు రైతుల ఆదాయం, పర్యావరణ పరిరక్షణకు మేలు జరుగుతుందని అన్నారు. భువనేశ్వర్‌లో మంగళవారం నిర్వహించిన ‘శ్రీ అన్న–2026, సంప్రదాయ విత్తన వ్యవస్థల బలోపేతం’ సదస్సును ఆయన ప్రారంభించారు. ప్రతి కుటుంబం తమ ఆహారంలో మండియా (రాగులు), బజ్రా, జొన్నలు తదితర చిరుధాన్యాలను చేర్చుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా రైతులు, వ్యవసాయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని చాటుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ సంప్రదాయంలో భాగం
చిరుధాన్యాలు భారత వ్యవసాయ వారసత్వంలో శతాబ్దాలుగా అంతర్భాగంగా ఉన్నాయని గవర్నర్ అన్నారు. ఒడిశాలోని గిరిజన, వర్షాధార ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు స్థానిక ప్రజల జీవనోపాధి, సాంస్కృతిక సంప్రదాయాలతో ముడిపడి ఉందన్నారు. ముఖ్యంగా మండియా సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు ఈ సంప్రదాయాన్ని పరిరక్షించవచ్చని చెప్పారు.
వాతావరణ మార్పులకు అనుకూలం
వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత వంటి సవాళ్ల నేపథ్యంలో చిరుధాన్యాల సాగు స్థిరమైన వ్యవసాయానికి అనుకూలమని గవర్నర్ పేర్కొన్నారు. తక్కువ నీటితో సాగు చేయవచ్చని, పెట్టుబడి వ్యయం కూడా తక్కువగా ఉంటుందని, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వీటికి ఉందని తెలిపారు. చిరుధాన్యాల్లో పీచు, అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయని, వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో చిరుధాన్యాల ప్రాధాన్యం మరింత పెరిగిందన్నారు.
మార్కెటింగ్‌కు ప్రోత్సాహం
ఒడిశా చిరుధాన్యాలను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు విస్తృతంగా చేరువ చేయాలంటే ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ సదుపాయాలను బలోపేతం చేయాలని గవర్నర్ సూచించారు.
సంప్రదాయ విత్తనాల పరిరక్షణ
సంప్రదాయ విత్తనాలను కాపాడేందుకు గ్రామీణ స్థాయిలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని, దేశీయ వంగడాలను నమోదు చేసి భద్రపరచాలని, వాటి పరస్పర మార్పిడిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. స్థానిక విత్తనాలు తరతరాలుగా రైతులు సంపాదించిన వ్యవసాయ పరిజ్ఞానానికి ప్రతీకలని, వ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణకు అవి కీలకమని అన్నారు. సంప్రదాయ విత్తనాల పరిరక్షణలో గిరిజనులు, మహిళా రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వారి స్థానిక పరిజ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని గవర్నర్ సూచించారు. మెరుగైన మార్కెట్ అవకాశాలను రైతులకు కల్పించాలని అన్నారు. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీ అన్న అభియాన్, కేంద్రం చేపడుతున్న చిరుధాన్యాల ప్రోత్సాహక కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు. సంప్రదాయ విత్తనాల పరిరక్షణ, వ్యవసాయ వైవిధ్యాన్ని కాపాడటం, రైతుల ఆదాయాన్ని పెంచడం వంటి సమష్టి చర్యలు ‘వికసిత్ ఒడిశా–2036’, ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యాల సాధనకు దోహదపడతాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మాంగీ లాల్ జాట్, ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్, మాజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఓయూఏటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రవాత్ కుమార్ రౌల్ సదస్సులో ప్రసంగించారు. వ్యవసాయ, రైతు సాధికారత శాఖ కమిషనర్ కమ్ సెక్రటరీ సచిన్ రామచంద్ర జాదవ్, వ్యవసాయ, ఆహార ఉత్పత్తి శాఖ డైరెక్టర్ డాక్టర్ పోమా టుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


