● వరండాలోనే విద్యార్థులకు పాఠాలు
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి పనాస్‌పూట్ పంచాయతీ గోయిలిఖారి గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు కొంతమంది వ్యక్తులు మంగళవారం తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో గోయిలిఖారి గ్రామానికి చెందిన సీతారామ్ పాంగి, రామ్‌చంద్ర పాంగి, భగవాన్ పాంగి అనే ముగ్గురు వ్యక్తులు వచ్చి పాఠశాల స్థలం తమదని చెబుతూ పట్టా చూపించారు. ఈ స్థలంలో పాఠశాల నిర్వహించడానికి అనుమతించేది లేదని పేర్కొంటూ విద్యార్థులను బయటకు పంపివేసి పాఠశాలకు తాళం వేశారు. హెచ్ఎం రేలి పాంగి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. ఈ విషయం తెలుసుకున్న పనాస్‌పూట్ సర్పంచ్ అర్జున్ హంతాల్, సామాజిక కార్యకర్త అనంత్ శిశా కూడా పాఠశాలకు చేరుకొని వారికి ఎంత చెప్పినా వినలేదు. దీంతో చేసేదేమీలేక విద్యార్థులకు వరండాలోనే పాఠాలు చెప్పి భోజనాలు కూడా అక్కడే పెట్టారు. అనంతరం హెచ్ఎం రేలి పాంగి చిత్రకొండ సమితి సీఆర్సీసీకి సమాచారం అందించారు. అలాగే చిత్రకొండ సమితి విద్యాశాఖ అధికారి గాయత్రీ దేవికు ఫోన్ ద్వారా విషయాన్ని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలి కోరారు.


