ఖనిజ సందప, పారిశ్రామిక అభివృద్ధి కీలకం..
రాయగడ: జిల్లాలో పారిశ్రామికంగా, ఖనిజ సంపద పరంగా అత్యంత కీలకమైన కాసీపూర్ సమితిను విభజించి రెండు సమితులు, రెండు తహసీల్‌లుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం. భౌగొళిక పరిస్థితులు, అధిక జనాభా, పరిపాలన ఇబ్బందులు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాసీపూర్ సమితిలో 24 గ్రామ పంచాయతీలున్నాయి. సుమారు 1.82 లక్షల జనాభా ఉంది. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన సమితిగా కాసీపూర్ గుర్తింపు పొందింది. ఇందులో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గ్రామాలు విస్తారంగా విస్తరించి ఉండటం, కొండ ప్రాంతాలు అధికంగా ఉండటంతో ప్రభుత్వ అధికారులు ప్రజలకు చేరువ కావడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమితి, తహసీల్ కార్యాలయాల అధికారులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో పరిపాలన, సేవల అందజేత ఆలస్యమవుతుంది.
అంగన్‌వాడీ, ఆరోగ్య సేవలకు ఆటంకం..
కాసీపూర్ సమితిలో 329 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఒకే సీడీపీఓ ద్వారా మహిళలు, చిన్నారులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను అమలు చేయడం కష్టసాధ్యంగా మారిందని కలెక్టర్ తన లేఖలో పేర్కొన్నారు. పోషకాహార లోపం, అంగన్‌వాడీ కేంద్రాల్లో అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులు తరచూ వస్తున్నాయని వివరించారు. సమితిలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉండగా, అత్యధిక సంఖ్యలో ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. అయినప్పటికీ గర్భిణుల ప్రసవాలు అధికంగా నమోదవుతున్నా ప్రాంతాల్లో భౌగొళిక దూరాల కారణంగా వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిపాలన విభజన ద్వారా ఆరోగ్య సేవలకు మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించవచ్చని భావిస్తున్నారు.
కాసీపూర్, టికిరి పేర్లు ప్రతిపాదన..
ప్రస్తుతం ఉన్న కాసీపూర్ సమితిని కాసీపూర్, టికిరి పేర్లతో రెండు సమితులుగా విభజించి, ఒక్కో సమితికి 12 గ్రామ పంచాయతీలు కేటాయించాలని కలెక్టర్ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఇదే విదంగా రెండు తహసీల్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే ప్రజలకు పరిపాలన, సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
టికిరి సమితి ఏర్పాటు కోసం దీర్ఘకాలిక డిమాండ్..
కాసీపూర్, టికిరి ప్రాంతాల్లో రెండు ఫారెస్ట్ రేంజ్‌లు ఉండగా.. ప్రస్తుతం సమితి పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లున్నాయి. టికిరిని ప్రత్యేక సమితిగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం గతంలో పలుమార్లు ఆందోళనలు కూడా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తాజా ప్రతిపాదనతో టికిరి ప్రత్యేక సమితి ఏర్పాటు అశలు మళ్లీ చిగురించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటే కాసీపూర్ ప్రాంత పరిపాలన వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది
కాసీపూర్ సమితిలో అత్యధికంగా బాకై ్సట్ నిల్వలున్నాయి. రానున్న రోజుల్లో ఖనిజ తవ్వకాలు, పారిశ్రామిక కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశాలు ఉండటంతో వాటి నిర్వహణకు ప్రత్యేక పరిపాలన వ్యవస్త అవసరమని కలెక్టర్ అభిప్రాయపడినట్లు సమాచారం. కాసీపూర్‌లోని పలు గనులు కొరాపుట్, కలహండి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఉండటంతో అక్కడికి చేరుకోవడం అధికారులకు కష్టంగా మారుతుంది. జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్) ద్వారా అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్న సమితి కూడా కాసీపూర్ కావడంతో అభివృద్ధి కార్యక్రమాల అమలులో సిబ్బందిపై పనిభారం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రెండు సమితుల ఏర్పాటు ద్వారా డీఎంఎఫ్ నిధులను సమర్థవంతంగా వినియోగించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చని పేర్కొన్నారు.


