కళాశాలల్లో ఉచిత ఇంటర్నెట్‌ | - | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో ఉచిత ఇంటర్నెట్‌

Nov 11 2026 3:39 AM | Updated on Nov 11 2026 3:39 AM

● రోజుకు 1 జీబీ డేటా

● 601 కాలేజీలకు వర్తింపు

భువనేశ్వర్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత హైస్పీడ్‌ వై–ఫై సౌకర్యం కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిజిటల్‌ విద్యను ప్రోత్సహించడంతోపాటు ఆన్‌లైన్‌ విద్యా వనరులను విద్యార్థులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘ఒడిశా ఎడ్యుకేషన్‌ నెట్‌’ పథకాన్ని అమలు చేయనుంది. అయితే ఉచిత ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేసే అవకాశాలు, నెట్‌వర్క్‌ నిర్వహణ, భద్రత తదితర అంశాలపై కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గం 10 శాఖలకు సంబంధించిన 13 ప్రతిపాదనల్లో భాగంగా ‘ఒడిశా ఎడ్యుకేషన్‌ నెట్‌’ పథకానికి ఆమోదం తెలిపింది. 2026–27 నుంచి 2028–29 వరకు మూడేళ్లలో రాష్ట్రంలోని 601 ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక కళాశాలలను ఈ పథకం పరిధిలోకి తీసుకురానుంది. ఇందుకు సుమారు రూ.393.62 కోట్ల వ్యయం అంచనా.

విద్యార్థులకు రోజుకు 1 జీబీ

పథకం కింద కళాశాల ప్రాంగణంలో ప్రతి విద్యార్థికి రోజుకు 1 జీబీ వరకు ఉచిత ఇంటర్నెట్‌ డేటా అందుబాటులో ఉంటుంది. తొలి దశలో ఇప్పటికే 130 కళాశాలల్లో వై–ఫై సౌకర్యాలు కల్పించారు.

డిజిటల్‌ విద్యకు ఊతం

ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయంతో ఆన్‌లైన్‌ తరగతులు, విద్యా వీడియోలు, ఈ–పుస్తకాలు, డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు మరింత అందుబాటులోకి రానుంది. డేటా సేకరణ, ప్రాజెక్టు పనులు, పరిశోధనలకు కూడా ఈ సదుపాయం ఉపయోగపడనుంది. ఖరీదైన ఇంటర్నెట్‌ కనెక్షన్లు పొందలేని విద్యార్థులకు ఈ పథకం ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు, పోటీ పరీక్షల అధ్యయన సామగ్రిని సులభంగా పొందడం ద్వారా పరీక్షలకు సన్నద్ధత కూడా మెరుగుపడనుంది. కంప్యూటర్‌ వినియోగం, డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థుల అవగాహన పెంపొందించేందుకు ఇది దోహదపడనుంది.

దుర్వినియోగంపై ఆందోళన

అయితే ఉచిత ఇంటర్నెట్‌ను విద్యా అవసరాలకు బదులుగా సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వంటి కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా తగిన సైబర్‌ భద్రతా చర్యలు లేకపోతే వ్యక్తిగత సమాచార భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు 601 కళాశాలల్లో నిరంతరాయంగా ఇంటర్నెట్‌ సేవలు అందించాలంటే నెట్‌వర్క్‌ నిర్వహణ, సాంకేతిక సహాయం, పరికరాల నిర్వహణకు నిరంతర వ్యయం అవసరం కానుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు నెట్‌వర్క్‌ను వినియోగించినప్పుడు వేగం తగ్గే సమస్య కూడా తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement