కీలక పరిణామం | - | Sakshi
Sakshi News home page

కీలక పరిణామం

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

● నెక్కంటితో పాటు ముగ్గురు కోర్టులో లొంగుబాటు

భగీరథి మండంగి హత్య కేసులో ..

రాయగడ: జిల్లాలో సంచలనం సృష్టించిన ఆదివాసీ నాయకుడు భగీరధి మండంగి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావుతో పాటు మరో ముగ్గురు నిందితులు సొమవారం స్థానిక ఎస్‌డీజేఎం కోర్టులో లొంగిపొయారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కోర్టులో హాజరైన వీరి బెయిల్‌ పిటీషన్‌లను న్యాయస్థానం తిరస్కరించడంతో నలుగురినీ రాయగడ ఉపకారాగారానికి తరలించారు. నెక్కంటితో పాటు ఇప్పిలి సన్యాసిరాజు, కె.కృష్ణారావు, పెద్దిన దిలీప్‌ కుమార్‌ కోర్టులో లొంగిపొయారు. ఎస్‌డీజేఎం కోర్టు బాధ్యతలు నిర్వహిస్తున్న న్యాయమూర్తి జ్యోతిర్మయి షడంగి ఈ కేసును విచారించి బెయిల్‌ మంజూరుకు నిరాకరించారు. దీంతో నలుగురు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ కేసులో మరో నిందితుడు ఆదినారాయణ సొమవారం కోర్టులో లొంగిపోలేదు. మరో నిందితుడు వై.వెంకటేశ్వరరావు అలియాస్‌ కొండబాబు కొన్ని నెలల కిందట గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

2010 లో ఆదివాసీ నాయకుడి హత్య

2010 లో రాయగడకు చెందిన ఆదివాసీ నాయకుడు భగీరథి మండంగిని అపహరించి హత్య చేసిన ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై 2010 డిసెంబర్‌ 23 న రాయగడ పోలీస్‌ స్టేషన్‌లో క్రైమ్‌ కేసు కింద నమోదైంది. తొలుత ఈ కేసును రాయగడ పోలీసులు దర్యాప్తు చేయగా, అనంతరం దర్యాప్తు బాధ్యతలను క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించారు. 2011 ఏప్రిల్‌ 5 న కటక్‌ సీఐడీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు తిరిగి నమోదు చేశారు. క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు అనంతరం నిందితులందరూ కేసు నుంచి విముక్తి పొందారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో కీలక మలుపు

అయితే భగీరథి మండంగి సొదరుడు జగన్నాధ్‌ మండంగి ఈ వ్యవహారంపై రాయగడ ఎస్‌డీజేఎం కోర్టులో మరొ కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం నిందితులందరీకీ నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. అయితే నిందితులు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ మంజూరు పొందారు. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సవాలు చేస్తు జగన్నాథ్‌ మండంగి తరఫున సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులను రద్దు చేసింది. అంతేకాకుండా రెండు వారాల్లోగా నిందితులందరూ దిగువ కోర్టులో లొంగిపొవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సొమవారం నెక్కంటితో సహా ముగ్గురు నిందితులు లొంగిపోయారు. కోర్టు బెయిల్‌ నిరాకరిచండంతో వారిని రాయగడ ఉపకారాగారానికి తరలించారు.

కోర్టు వద్ద మద్దతుదారుల సందడి

నెక్కంటి కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన సమయంలో ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాదులు నవకుమార్‌ కంటా, మంగళమూర్తి బెవురియా మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి నెక్కంటి కోర్టులో లొంగిపొయారని తెలిపారు. త్వరలోనే హైకోర్టును ఆశ్రయించి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. దీంతో సుమారు 16 ఏళ్ల కిందట జరిగిన భగీరథి మండంగి హత్య కేసు మరోసారి రాయగడలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement