అరుదైన నంది విగ్రహం గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

అరుదైన నంది విగ్రహం గుర్తింపు

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

రాయగడ : జిల్లాలోని గుణుపూర్‌ పట్టణంలో ఉన్న ప్రాచీన రామలింగేశ్వర (బాఘువా) ఆలయంలో ఆరుదైన చారిత్రక శాసనంతో కూడిన శతాబ్దం నాటి లోహ నంది విగ్రహం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు గుర్తించిన నంది వాహన శాసనాల్లో ఇది రెండోదిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. గతంలో గజపతి జిల్లా పర్లాకిమిడి సమీపంలోని రామసాగర్‌ ఆలయంలో ఇలాంటి ఉత్సవ విగ్రహంపై ఒడియా శాసనం గుర్తించినట్లు చారిత్రక పరిశోధకులు వెల్లడించారు.

1926 లో సమర్పించిన నంది విగ్రహం

రాయగడ ప్రాంతంలో పురావస్తు అవశేషాలు అన్వేషణ సందర్భంగా డాక్టర్‌ ప్రాణక్రిష్ణ పాణిగ్రహి, అక్షయ దాస్‌, అశోక్‌ రథ్‌ లు ఈ అరుదైన నంది వాహనాన్ని గుర్తించారు. దీనిపై ఉన్న శాసనాన్ని లిపి పరిశోధకుడు విష్ణు మోహన్‌ అధికారి చదివి వివరాలను వెల్లడించారు. ఆయన పరిశోధన ప్రకారం ఈ నంది విగ్రహాన్ని అక్షయ నామ సంవత్సర భాద్రపద శుక్ల దశమి శుక్రవారం అంటే 17 సెప్టెంబరు 1926 న గుణుపూర్‌ తాలూక ప్రజలు ఆలయానికి సమర్పించారు. ఈ విగ్రహాన్ని సత్యవాది సాహు నిర్మించినట్లు శాసనం ద్వారా తెలుస్తోంది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి నంది వాహనం ఒడిశాలో ఆరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

గంగరాజుల కాలం నాటి ఆలయంగా గుర్తింపు

బాఘువా ఆలయం ముందు ఉన్న సింహ శిల్లాపు కళింగ శిల్పకళా సంప్రదాయంలో 8వ నుండి 10వ శతాబ్దాల మధ్య కనిపించే శైలిని పోలి ఉన్నాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆధారాలతో ఆలయ నిర్మాణం కూడా అదే కాలంలో జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఆలయంలో తూర్పు గంగ రాజుల కాలానికి చెందిన సప్తమాతృకల విగ్రహాల శిఽధిలాలు, గర్భగుడిలో ఉన్న దుర్గాదేవి, గణేశ విగ్రహాలు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ను కలిగి ఉన్నాయి. ఇవి కళింగ నగరంలోని సొమేశ్వర ఆలయం, మధుకేశ్వర ఆలయంలోని గణేష విగ్రహాలు, ఇతర ప్రాచీన గంగ రాజుల కాలంనాటి శిల్పాలతో పొలికలు కలిగి ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆలయంలోని శివలింగం, యోనిపీఠం సమీపంలో ఉన్న దుర్గాదేవి విగ్రహం కూడా ఈ ఆలయం ప్రాచీన గంగ రాజుల కాలానికి చెందిన చారిత్రక కట్టడమనే విషయాన్ని సూచిస్తున్నాయని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

గుణుపూర్‌ ప్రాంతంలో వెలుగులోకి వస్తున్న చారిత్రక సంపద

గుణుపూర్‌ ప్రాంతంలో గతంలోనూ గంగ రాజుల కాలానికి చెందిన పలు శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రాచీన కాాలం నుంచి ఆధునిక కాలం వరకు ఆలయానికి సంబంఽధించిన వివిధ అవశేషాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. ఇటీవల గుణుపూర్‌ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో సుమారు 147 సంవత్సరాల పురాతన అరుదైన ఒడియా రాగి శాసనం కూడా గుర్తించారు. స్ధానిక రాజపురొహితులలుగా పేరొందిన అశోక్‌ రద్‌ , హృషికేష్‌ రథ్‌ల ఇంట్లో ఈ చారిత్రక రాగి ఫలకం అభించింది. గుణుపూర్‌ ప్రాంతం అపారమైన చారిత్రక, పురావస్తు సంపదకు నిలయంగా ఉందని, ఇంకా అనేక మరుగునపడిన చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని లిపి పరిశోధకులు విష్ణు మోహన్‌ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో భాఘువా ఆలయం ,దాని పరిసరాల్లో పురావస్తు సంపదపై మరింత విస్తృతంగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని చారిత్రక అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చారిత్రక నంది విగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement