భువనేశ్వర్: మూడు అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఆరేళ్ల బాలుడు మృతి చెందగా, ఒక వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విచారకర సంఘటన కటక్ దర్గా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్తి పొఖొరిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కుటుంబం నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భవనం నుంచి దట్టమైన పొగ వెలువడటాన్ని స్థానికులు గమనించి అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. మంటలు అతి వేగంగా వ్యాపించి భవనం మొత్తాన్ని చుట్టుముట్టాయి. దీంతో లోపల ఉన్నవారు చిక్కుకుపోయారు. సహాయం కోసం కేకలు విన్న ఇరుగుపొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదంలో బాలుడు తీవ్రంగా కాలిపోయాడు. అతడిని రక్షించి ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స జరుగుతుండగా గాయాలతో బాలుడు మరణించాడు. ఈ ఘటనలో గాయపడిన వృద్ధుడు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఎస్‌సీబీ మెడికల్ ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు నివారించాయి. సిబ్బంది భవనంలోకి ప్రవేశించి, లోపల చిక్కుకున్న ఇతరులను రక్షించారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు, అగ్నిమాపక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.


