రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి సద్భావన మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జరిగిన శిబిరంలో ఎస్పీ రాజ్‌ప్రసాద్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ దిల్లిప్, జిల్లా ముఖ్యవైద్యాధికారి విశ్వంబర్ బెహర, గుణుపూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్ కుమార్ ప్రదాన్, తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, బీడీవో శివప్రసాద్ పట్నాయక్ ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరిపారు. ఈ శిబిరంలో మొత్తం 57 వినతులు అందాయి. వీటిలో 43 వ్యక్తిగత ఫిర్యాదులు, పది సామూహిక వినతిపత్రాలు ఉండగా మరో నాలుగు ఆరోగ్య సంబంధిత దరఖాస్తులు నమోదయ్యాయి. ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కొరారు. ఈ సందర్బంగా జిల్లా కలక్టర్ కులకర్ణి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఏడు వినతులను అక్కడిక్కడే పరిష్కారం కల్పించారు. మిగిలిన దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పంపించి వాటిపై సమగ్ర విచారణ జరిపి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


