జాతీయ స్థాయి పోటీలకు నరసన్నపేట విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు నరసన్నపేట విద్యార్థులు

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

స్పోర్ట్స్‌కోటాలో సునీల్‌కు ఏజీబీఎస్సీ సీటు

నరసన్నపేట: స్కూల్‌ గేమ్స్‌లో భాగంగా జాతీయ స్థాయిలో డిల్లీలో జరగనున్న గట్కా పోటీలకు నరసన్నపేట పీఎంశ్రీ స్కూల్‌ విద్యార్థులు పి.ధనలక్ష్మి, జి.హారికలు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో అక్టోబర్‌ నెలలో జరిగిన పోటీల్లో వీరు ప్రతిభ చూపి బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపిక చేశారని స్కూల్‌ హెచ్‌ఎం టి.రూపవతి తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో వీరు ప్రతిభ చూపి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరుతీసుకురావాలని స్కూల్‌ సిబ్బంది ఆకాంక్షిస్తున్నారు. కాగా ఈ విద్యార్థులను స్కూల్‌ ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.

ముగ్గురు యువకులపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లాకు చెందిన ముగ్గురు యువకులపై మాదక ద్రవ్యాలు, మానసిక ఉత్తేజిత పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం (పీఐటీ ఎన్డీపీఎస్‌ యాక్ట్‌) నమోదైంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర రెవెన్యూ (ఎకై ్సజ్‌) శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం రూరల్‌ మండలం భైరివానిపేటకు చెందిన బగ్గు నవీ , సారవకోట మండలం అలుదు సొంత గ్రామం, ప్రస్తుతం పాతపట్నంలో నివసిస్తున్న సగిపల్లి పవన్‌ అలియాస్‌ రోషన్‌ అలియాస్‌ రోష్‌, టెక్కలి ఆది ఆంధ్రావీధికి చెందిన చిత్తా ఎర్రయ్య అలియాస్‌ పుష్పరాజ్‌ అలియాస్‌ రాజ్‌పై ఈ యాక్ట్‌ నమోదు చేసినట్లు ఉత్తర్వుల్లో ఉన్నాయి. వీరు ముగ్గురూ గంజాయిని అక్రమంగా రవాణా చేసి విక్రయిస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తమ విచారణలో తెలుసుకుని, ఇటీవల పైఅధికారులకు నివేదిక పంపించారు. దీంతో సంబంధిత రాష్ట్ర రెవెన్యూ (ఎకై ్సజ్‌) శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌ మీనా ముగ్గురు యువకులను తక్షణమే అదుపులోకి తీసుకుని విశాఖ జైలుకు తరలించాలని ఎస్పీకి ఆదేశిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అదుపుతప్పి బోల్తాపడిన కారు

టెక్కలి రూరల్‌: మండలంలోని బొప్పాయిపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఒక కారు అదుపుతప్పి బోల్తాపడింది. శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న ఈ కారు బొప్పాయిపురం సమీపంలో.. కారు డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడి సమీపంలోని చెట్టును ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో కారులోని ఉన్నవారికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు.

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన పిల్లా సునీల్‌ సత్తాచాటాడు. గత కొన్నేళ్లగా ఫెన్సింగ్‌ క్రీడలో అత్యద్భుతంగా రాణించి రాష్ట్ర, జాతీయస్థాయిలో మెరుస్తూ వచ్చిన పిల్లా సునీల్‌ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ యువ సంచలనానికి స్పోర్ట్స్‌ కోటాలో రాజమహేంద్రవరంలోని అగ్రికల్చర్‌ కళాశాలలో ఏజీబీఎస్సీ సీటు దక్కింది. తాజాగా 2026–27 విద్యా సంవత్సరానికి సంబందించి సీట్ల కేటాయింపు జాబితాను ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రకటించగా.. అందులో సునీల్‌ సీటు దక్కించుకున్నాడు. జిల్లాలోని ఎల్‌.ఎన్‌.పేట మండలం పొడుగుపాడు గ్రామానికి చెందిన సునీల్‌ గత కొన్నేళ్లుగా ఫెన్సింగ్‌ క్రీడలో శ్రీకాకుళంలోని టౌన్‌ హాల్‌ కేంద్రంగా జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఐఎస్‌ కోచ్‌ జోగిపాటి వంశీ శిక్షణలో సత్తాచాటుతున్నాడు. ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలోనే కాకుండా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సైతం సునీల్‌ పాల్గొని రాణించాడు. సునీల్‌ తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయమే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. 10వ తరగతి వరకు కరవలస జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ చదువుకోగా, ఇంటర్మీడియట్‌ శ్రీకాకుళంలోని గ్లోబల్‌ కళాశాలలో చదువుకున్నాడు. సునీల్‌కి అవకాశం లభించడంపై శ్రీకాకుళం జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బలభద్రుని రాజా, ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఐఎస్‌ కోచ్‌ జోగిపాటి వంశీ, ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను తదితరులు అభినందనలు తెలిపారు.

ఎంపికై న విద్యార్థులతో ఉపాధ్యాయ బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement