జయపురం: వివాదాస్పద కొఠియా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో వివాదం ముదిరింది. ఈ విషయంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం జయపురంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. ఓటు వెయ్యడానికి వెళ్లని వారు ఓట్లు సైతం పడ్డాయని తెలిపారు. దీన్ని ఓట్ చోరీగా అభివర్ణించారు. అంతే కాకుండా మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పోలీసులే ఓట్లు వేశారని ఆరోపించారు. ఎన్నికల పారదర్శకతపై ఆయన ప్రశ్నలు లేవనెత్తుతూ కొఠియా ప్రాంతంలో ఎవరెవరు ఓటేశారో దాని సీసీ టీవీ దృశ్యాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.


