రాయగడ: ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేయడానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రజలకు పట్టాలు అందించే అధికారుల కార్యాలయాలకే సొంత పట్టా లేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ రాయగడ జిల్లాలో ఇదే వాస్తవ పరిస్థితి అని సమాచారం. జిల్లాలో వివిధ రకాల రెవెర్యూ వసూళ్లు నిర్వహిస్తూ, కులమతాలకు అతీతంగా ప్రజలకు తమ సంతకాలతో పట్టాలు మంజూరు చేస్తున్న తహసీల్దార్ల కార్యాలయాల పేర్లపై ఇప్పటివరకు ప్రత్యేక పట్టాలు లేవని తెలుస్తోంది. రాయగడ జిల్లాలో ప్రస్తుతం 11 తహసీల్దార్ కార్యాలయాలు ఉండగా 80కి పైగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల కార్యాలయాలకు కూడా సొంత పట్టాలు లేవని సమాచారం. అదేవిధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెర్యూ బంగ్లాలకు సైతం రెవెన్యూ శాఖ పేరుతో పట్టాలు లేవని తెలుస్తోంది.
ప్రభుత్వ ఖాతాలోనే కార్యాలయ భూములు
జిల్లాలోని రవెన్యూ శాఖ కార్యాలయాల భూములు ప్రభుత్వ ఖాతాలో ఉన్నట్లు సమాచారం. ఒక శాఖలకు చెందిన భవనం నిర్ధిష్ట ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో కొనసాగుతున్నప్పుడు ఆ భూమిని సంబంధిత శాఖ పేరుతో పట్టా చేయించుకునే అవకాశం ఉందని, ఇందుకోసం శాఖ అధికారులు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలకు ఇప్పటికీ ప్రత్యేక పట్టాలు లేకపోవడం విశ్వసనీయంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పాఠశాలలకు వస్తే..
రెవెన్యూ కార్యాలయాలకు ఎందుకు రాదు!
గత కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల భూములను ఆయా పాఠశాలల పేర్లతో పట్టా చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అదే విధంగా తహసీల్దార్ కార్యాలయ భవనాలను కూడా సంబంధిత కార్యాలయాల పేర్లతో పట్టా చేయించుకొవచ్చని సీనియర్ న్యాయవాదుల అభిప్రాయం. ప్రభుత్వ కార్యాలయాల భూములు సంబంధిత శాఖల పేర్లతో పట్టా ఉండే, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై ఉద్యోగులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
చర్యలు తీసుకుంటాం: జిల్లా అదనపు కలెక్టర్
ఈ విషయంపై జిల్లా అదనపు కలక్టర్ (రెవెన్యూ) నిహార్ రంజన్ కుహోరొను ప్రశ్నించగా.. నిజంగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలకు పట్టాలు లేకపోతే సంబంధిత తహసీల్దార్లు స్వయంగా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, ల్యాంప్స్ సంస్థలకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ఆయా సంస్థల పేర్లతో పట్టాలు కల్పించే ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. తహసీల్దార్ కార్యాలయాలు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలకు పట్టాలు లేని విషయం గుర్తిస్తే, దీనిపై పరిపాలనపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
మిషన్ మోడల్ పట్టాల ప్రక్రియ చేపట్టాలి..
రాయగడ జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు సమాచారం ప్రభుత్వం మిషన్ మోడల్‌లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఈ కార్యాలయాలకు పట్టాలు కల్పిస్తే, బ్రిటీష్ పాలన కాలం నుంచి కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు భూములకు కూడా పట్టాలు పొందే అవకాశం ఉంటుందని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, కార్యాలయాల భూముల హక్కుల స్పష్టత కోసం ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


