మాజీ ఎంపీ నెక్కంటి ఇంటిలో..
రాయగడ: రాయగడ ట్రక్ యజమానుల సంఘంలో సంచలనం సృష్టించిన సుమారు రూ.60 కోట్ల ఆర్థిక అవకతవకల కేసులో క్రైమ్ బ్రాంచ్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అధికారులు శుక్ర వారం నాడు రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు నివాసంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. స్థానిక రాణిగుడఫారంలో గల ఆయన నివాసంలో 21 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం చేరుకుంది. అదనపు ఎస్‌పి ఆశీష్ కుమార్ మిశ్రా నేతృత్వంలో చేపట్టిన ఈ దర్యాప్తులో ఐదుగురు డీఎస్పీలు, ఐదుగురు ఇన్‌స్పెక్టర్లుతో సహా మొత్తం 21 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నట్లు సమాచారం. గత కొద్ది రొజుల క్రితం ఈఓడబ్ల్యూ బృందం సదరు పోలీస్ స్టేషన్ నుంచి కేసుకు సంబంధించిన పత్రాలను సేకరించినట్లు తెలిసింది. అనంతరం మరో భారీ బృందం ఇక్కడకు చేరుకుని దరాప్తును చేపట్టింది. సదరు పోలీస్ స్టేషన్ నుంచి సేకరించిన పత్రాలకు సంబంధించి రెండు రొజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించిన సంబఽంధిత శాఖ అధికారులు ఈమేరకు సోదాలకు పాల్పడ్డారని సమాచారం.
స్థానిక రాణిగుడఫారంలో నివాసముంటున్న నెక్కంటి ఇంటిలో సోదాలు చేసేందుకు వచ్చిన బృందం ఇంటి గేటు వద్ద సుమారు గంట సమయం వేచి ఉంది. ఆయన ఇంటిలో (నెక్కంటి) లేకపోవడంతో ఇంటి కాపలాదారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు తలుపులు తెరవడంతో ఇంటి లోపలకు చేరుకున్నారు. అనంతరం నెక్కంటి ఉంటున్న ప్రత్యేక గదిలో సొదాలను నిర్వహించేందుకు ప్రయత్నించిన అధికారులు అందుకు సంబంధించి గది తాళాల కోసం సుమారు మూడు గంటల పాటుగా వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం తాళాలను ఆయన అనుచరుల సమక్షంలో తెరిచిన అధికారులు సోదాల్లో నిమగ్నమయ్యారు.
పలు ప్రాంతాల్లో సోదాలు
రాయగడకు చేరుకున్న అధికారుల బృందంలో మరో బృందం స్థానిక డీఐసీ కార్యాలయం సమీపంలో నెక్కంటికి చెందిన ఆదిత్య ఎల్‌పిజి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అదేవిధంగా మరో 9 స్థానాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ట్రక్ యజమానుల సంఘానికి చెందిన సుమారు రూ.60 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపిస్తు సంఘం అధ్యక్షుడు దివంగత వై.వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు గతంలో మాజీ ఎంపి ఎన్ భాస్కరరావుతో పాటు మరి కొందరిపై సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సదరు పోలీసులు ఈ దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు. ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నందున కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. ఈఒడబ్ల్యూ సొదాలతో ఈ కేసులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది.


