● జిల్లా కలెక్టర్‌కు తండికి గ్రామస్తుల విజ్ఞప్తి
మల్కన్‌గిరి: తమ గ్రామంలో నెలకున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని మల్కన్‌గిరి సమితి తండికి పంచాయతీకి చెందిన ప్రజలు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రధమేశ్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. తండికి పంచాయతీ పరిధిలోని బురిది, గుటమగూఢ, దామగూఢ, తెంతులిగూఢ, బాలగూఢ, జాముగూఢ, లక్ష్మణ్‌పూర్, నారాయణ్‌గూఢ, దంగాగూఢ, గురాఘట్, అయ్‌తగూఢ తదితర గ్రామాలను చెందిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికు తెచ్చారు. ముఖ్యంగా ఈ గ్రామాల్లోని వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు పూర్తిగా వర్షాధారంగానే వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయి, వరిసాగు తీవ్రంగా దెబ్బతినడంతో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తమ గ్రామాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పైపులైన్ ద్వారా తాగునీరు సరఫరా చేయాలని, వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆదివాసీ సంఘం బురుది శాఖ జోన్ ప్రతినిధి ఇంద్రరాజ్ దురువా, అజయ్ మాడి, రసు మాడ్కామి తదితరులు ఉన్నారు.


