రాయగడ: భారత జాతీయ భద్రత, డేటా సార్వభౌమత్వం, పౌరుల గోప్యతతో పాటు స్వదేశీ టెలికం పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ స్టార్‌లింక్‌కు భారత్‌లో సేవలందించేందుకు అనుమతులు ఇవ్వకూడదని, ఇప్పటికే ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని స్వదేశీ జాగరణ మంచ్ రాయగడ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉద్దేశించిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ రవీంద్రనాథ్ కుమార్ కహార్‌కు అందజేశారు. స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్‌వర్క్‌పై విదేశీ సంస్థ నియంత్రణ దేశ జాతీయ భద్రత, వ్యూహాత్మక సార్వభౌమత్వానికి ప్రమాదకరమని మంచ్ వినతిపత్రంలో పేర్కొంది. భారతీయ పౌరుల వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యతకు ముప్పు ఏర్పడడంతో పాటు కీలకమైన డేటా విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ పెట్టుబడులపై వ్యూహాత్మకంగా ఆధారపడడం వల్ల దేశీయ టెలికం రంగం బలహీనపడుతుందని, బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు స్వదేశీ టెలికం సంస్థల ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. స్టార్‌లింక్‌కు యూనిఫైడ్ లైసెన్స్ పరిధిలో అనుమతులు మంజూరు చేయవద్దని, ఇప్పటికే ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని మంచ్ కోరింది. ఈ నిర్ణయం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు విరుద్దమని పేర్కొంటూ, దేశీయ టెలికం పరిశ్రమ అభివృద్ధికి ఆటంకం కలిగించే విదేశీ ఆధారిత విధానాలను పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ జిల్లా సమన్వయకర్త సుదర్శన్ పాడి, సీనియర్ సిటిజన్స్ ప్రముఖుడు డాక్టర్ బిపిన్ బిహారి బిశ్వాల్, పర్యావరణ ప్రముఖుడు, న్యాయవాది లావన్య మోహన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.


