శ్రీమందిరంలో క్యూ దర్శనం | - | Sakshi
Sakshi News home page

శ్రీమందిరంలో క్యూ దర్శనం

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

భువనేశ్వర్‌: పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో భక్తుల దర్శన విధానంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. రద్దీ నియంత్రణతో పాటు భక్తులకు క్రమబద్ధమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించే ఉద్దేశంతో ప్రతిపాదించిన ‘ధాడీ దర్శన్‌’ (క్యూ దర్శన) వ్యవస్థ అమలుకు సిద్ధమవుతోంది. కార్తీక మాసం ముగిసిన అనంతరం, నూతన సంవత్సరానికి ముందే ఈ కొత్త విధానాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లన్నీ ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ శుక్రవారం వెల్లడించారు.

గంటకు 10 వేల మందికి దర్శనం

కొత్త విధానంలో ఒకేసారి ఎనిమిది ర్యాంపుల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. తద్వారా గంటకు సుమారు 10 వేల మంది భక్తులు మహాప్రభువును దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ సమయాల్లో భక్తుల కదలికలను క్రమబద్ధీకరించడం, ఒకేచోట భారీగా గుమిగూడకుండా చూడటం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

గరుడ స్తంభం – బహార కఠొ మధ్య ఏర్పాటు

క్యూ దర్శన వ్యవస్థను గరుడ స్తంభం నుంచి బహార కఠొ వరకు ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నారు. ర్యాంపుల వ్యవస్థ మడతపెట్టే వంతెన తరహాలో పనిచేసేలా రూపొందించారు. దర్శనం సమయంలో ర్యాంపులను తెరిచి భక్తులను అనుమతించి, ఆలయ నిత్య కై ంకర్యాలు పూర్తయ్యే సమయంలో వాటిని మూసివేసే విధంగా సాంకేతిక రూపకల్పన చేశారు. ఈ వ్యవస్థకు ఐఐటీ భువనేశ్వర్‌ సాంకేతిక సహకారం అందించింది.

ప్రతిపాదన నుంచి అమలుదిశగా..

శ్రీమందిరంలో క్యూ దర్శన వ్యవస్థపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రభుత్వం తొలుత మూడు–నాలుగు నెలల్లో వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. అప్పట్లో ఐదు ర్యాంపుల ద్వారా ఒకేసారి సుమారు 50 మంది దర్శనం చేసుకునేలా ప్రాథమిక నమూనాను పరిశీలించారు. గంటకు సుమారు 8 వేల మందికి దర్శనం కల్పించే లక్ష్యాన్ని కూడా వెల్లడించారు. అనంతరం అక్టోబరులో పైలట్‌ మోడల్‌ను సిద్ధం చేసి, ముందుగా ప్రతిహారి నియోగంతోపాటు ఇతర సేవాయత్‌ నియోగుల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించారు. భారీ రద్దీ సమయంలో తాళ్లతో ఏర్పాటు చేసే సాధారణ బారికేడ్ల కంటే ప్రత్యేక క్యూ వ్యవస్థే సమర్థంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది.

నియోగుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం

ప్రస్తుత దశలో ఛొత్తీసా నియోగులు, శ్రీ జగన్నాథ ఆలయ పాలకమండలి సభ్యులు కొత్త దర్శన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. వారి పరిశీలన, ఆమోదం అనంతరం వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు. అంటే ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నప్పటికీ, ఆలయ సంప్రదాయాలు, నిత్యకై ంకర్యాలు, భక్తుల రాకపోకలకు అనుగుణంగా చివరి పరిశీలనకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

భారీ రద్దీకి పరిష్కారంగా..

శ్రీమందిరానికి ఏడాది పొడవునా దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. రథ యాత్ర, స్నాన పౌర్ణమి, సున్నా బేషొ వంటి ప్రత్యేక సందర్భాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. సున్నా బేషొ సమయంలో పూరీకి భారీగా భక్తులు తరలిరావడంతో భువనేశ్వర్‌–పూరీ జాతీయ రహదారిపైనా తీవ్ర రద్దీ ఏర్పడిన సందర్భాలున్నాయి. ఇటీవల కార్తీక వ్రతాల సందర్భంగా వేలాది హబిష్యాలీలు, ఇతర భక్తులు పూరీలో బస చేయడంతో ఆలయం పరిసరాల్లో రద్దీ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం లోపల, నాలుగు ప్రధాన ద్వారాల వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తుల కదలికలను క్రమబద్ధీకరించారు.

ఈ నేపథ్యంలో కొత్త క్యూ దర్శన విధానం అందుబాటులోకి వస్తే భక్తుల ప్రవాహాన్ని నియంత్రించడంతో పాటు దర్శన ప్రక్రియ మరింత వ్యవసీకృతం కానుంది. అయితే ఆలయ ఆచారాలు, సేవాయతుల విధులు, ప్రత్యేక పర్వదినాల్లో ఉండే భారీ రద్దీకి అనుగుణంగా ఈ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తుందనేది అమలు అనంతరం కీలకంగా మారనుంది. ప్రతిపాదన నుంచి పైలట్‌ మోడల్‌ వరకు సాగిన ప్రక్రియ ఇప్పుడు తుది అమలుదశకు చేరుకోవడంతో.. నూతన సంవత్సరానికి ముందే మహాప్రభువు దర్శనంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

గంటకు 10 వేల మంది భక్తులకు దర్శన సౌకర్యం

నూతన సంవత్సరానికి ముందే అమలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement