● భుషంగగుడ పంచాయతీ ప్రజల డిమాండ్
● పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన మహిళలు
జయపురం: మద్యం, నాటుసారా అమ్మకాలను తమ గ్రామంలో నిలిపి వేయాలని మహిళలు నినదించారు. అంతటితో ఆగకుండా కుంధ్ర పోలీసుస్టేషన్‌కు చేరుకొని ముట్టడించారు. జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి భుషంగగుడ గ్రామ పంచాయితీ గ్రామాల నుంచి మహిళ సంఘాలు, స్వయం సహాయక గ్రూపులకు చెందిన వందలాది మంది మహిళలు కుంధ్ర పోలీసు స్టేషన్‌ను శుక్రవారం ముట్టడించారు. నినాదాలు చేస్తూ ఆందోళన జరిపారు. రెండు నెలలుగా తాము తమ గ్రామ పంచాయతీలో సారా బట్టీలను ఎత్తివేయించాలని, మద్యం అమ్మకాలు బంద్ చేయాలని అబకారీ అధికారులు, పోలీసులు, జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని మహిళలు ఆరోపించారు. అయినా సారా బట్టీలు అమ్మకాలు ఎందుకు బందు చేయలేదని అధికారులను సూటిగా ప్రశ్నించారు. భుషంగగుడ పంచాయతీలో ప్రతి గ్రామంలోను సారా వండే బట్టీలు, సారా అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు. గ్రామాలలో యువకుల నుంచి విద్యార్థుల వరకు మద్యానికి బానిసైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో సారా విచ్చల విడిగా అమ్మటం వలన పాఠశాలలు, కళాశాలలు మార్కెట్ మొదలగు ప్రాంతాలలో అసామాజిక శక్తుల వలన శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. కుంధ్ర పోలీసులు సారాబట్టీలపై దాడులు చేయటం లేదని మహిళలు మండిపడ్డారు. అబకారీ అధికారులు ఎందుకు నిద్ర వదలటం లేదని నిలదీశారు. చట్టవిరుద్ద సారా బట్టీలు, సారా అమ్మకాలు వెంటనే బందు చేయాలని జిల్లా కలెక్టర్, జయపురం సబ్‌కలెక్టర్లను వినతి పత్రాలను పోలీసు అధికారికి అందజేశారు. సారా బట్టీలు, దుకాణాలపైన దాడులు నిర్వహించి మద్యం మాఫియాను అరెస్టు చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రోజూ పెట్రోలింగ్ జరపాలని కోరారు. కుంధ్ర అబకారీ అధికారి ప్రతాప్ కుమార్ రథ్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఆందోళనకారులతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. అయితే ఆందోళనకారులను శాంతిపజేయడంతలో విఫలమయ్యారు. పోలీసు అధికారి అశ్విణీ పట్నాయక్ కూడా మహిళలకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు మద్యం అమ్మకాలు, బట్టీలు బంద్ అయ్యేంత వరకు తమ ఆందోళన కోనసాగుతోందని స్పష్టం చేశారు.


