పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్ యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ మందిరంలో మండియా దివాస్ (రాగులు), శ్రీఅర్నయోజనా పథకం స్టాల్స్‌ను జిల్లా వ్యవసాయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి విచ్చేసి కలెక్టరేట్ వద్ద రాగులు, జోన్నల స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఏడీఎం మునీంద్ర హానంగ, జిల్లా ముఖ్య వ్యవసాయ అధికారి రవీంద్ర కుమార్ అదెక్, ఆదనపు మత్స్యఅధికారి బిరంచీ నారాయణ మంగరాజ్, ఆదనపు ఎస్పీ నిరంజన్ బెహారా పాల్గొన్నారు. రాగు జావ మనకు పౌష్టిక ఆహారమని అన్నారు. నిత్య ఆహారంలో రోజూ ఉదయం తీసుకోవాలని ఏ.డి.యం. మునీంద్ర హానంగ అన్నారు. ఈ నెల 10, 11 తేదీలలో శ్రీఅర్న యోజనా పథకంపై అంతర్జాతీయ సమ్మేళనం జరుగనున్న దృష్ట్యా పర్లాకిమిడి అనేక కార్యక్రమాలు జరుగనున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి రవీంద్ర కుమార్ అధెక్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మోహానాలో రాగు పంటను ప్రధానంగా వేసి అధిక స్థాయిలో దిగుబడి సాధించిన రైతుకు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అందజేశారు. కార్యక్రమంలో ఆదనపు కృషి అధికారి, మిల్లెట్ మిషన్ సంఘమితార ప్రధాన్, వ్యవసాయ ఉద్యోగి శుభశ్రీ ప్రియదర్శినీ వాఖ్యాతగా వ్యవహారించగా, కె.సూరజ్ కుమార్ పాత్రో, సోమేష్ మైత్రి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్: ఉత్తరాంధ్రలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ హెచ్‌పీసీఎల్ వారి ఆర్థిక సహకారంతో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జనరల్ డ్యూటీ అసిస్టెంట్, వేర్ హౌస్ అసోసియేట్, పేషెంట్ రిలేషన్ అసోసియేట్ కోర్సుల్లో మూడు నెలల పాటు రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఆవరణలోని బొల్లినేని మెడిస్కిల్స్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ చదివిన 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9121999654, 7680945357 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఆదిత్యుని సన్నిధిలో
ఆర్‌టీఐ కమిషనర్
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కమిషనర్ పి.ఎస్.నాయుడు కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్లు వెంకటేశ్వరరావు, వెంకటరమణ, అర్చకులు ఇప్పిలి సాందీప్‌శర్మ తదితరులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ విశిష్టతను అర్చకులు కమిషనర్‌కు వివరించారు. స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేసారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు కొయ్యాన రామ్మోహనరావు, అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, సాందీప్‌శర్మ, షణ్ముఖశర్మ, ఇన్‌చార్జి తహశీల్దార్ మునగవలస చక్రవర్తి, ఆర్‌ఐ లింగరాజు తదితరులు పాల్గొన్నారు.


