క్షేత్రస్థాయి పరిశీలన వివరాలు
సమర్పించిన కేంద్ర శాఖల సంయుక్త
బృందం
భువనేశ్వర్: అర్నబ్ తుఫాన్, అనంతరం సంభవించిన వరదల కారణంగా ఒడిశాలోని వివిధ జిల్లాల్లో జరిగిన నష్టాలపై కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖలతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం సమీక్ష నిర్వహించింది. ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం గురువారం లోక్‌సేవా భవన్‌లో జరిగిన సమావేశంలో బృందం తన పరిశీలనలను రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూగర్గ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి రవి శంకర్ నేతృత్వంలోని కేంద్ర బృందం హాజరైంది. వ్యవసాయం, ఆర్థికం, జలశక్తి, విద్యుత్, రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి తదితర కేంద్ర శాఖలకు చెందిన అధికారులు, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభివృద్ధి కమిషనర్, అదనపు సీఎస్ దేవరంజన్‌కుమార్ సింగ్, రెవెన్యూ శాఖ అదనపు సీఎస్ డాక్టర్ అరవింద్ కుమార్ పాఢీ, ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ) రాజేష్ ప్రభాకర్ పాటిల్‌తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
గజపతి, గంజాం జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
కేంద్ర బృందం నవంబర్ 3న గజపతి, 4న గంజాం జిల్లాల్లోని తుఫాన్, వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించింది. ఈ సందర్భంగా పంటలు, రహదారులు, విద్యుత్ వ్యవస్థ, జలవనరుల శాఖకు చెందిన నదీ గట్లు, కాలువలు తదితర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, నష్టాల వివరాలను రాష్ట్ర అధికారులతో సమావేశంలో పంచుకుంది. తుఫాన్, అనంతరం వరదల కారణంగా వ్యవసాయ రంగానికి భారీ నష్టం వాటిళ్లినట్లు కేంద్ర బృందం గుర్తించింది. రహదారులు, విద్యుత్ వ్యవస్థ, నదీగట్లు, కాలువలు తదితర మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. నష్టం విస్తృతంగా ఉండటంతో పూర్తిస్థాయి అంచనాకు మరికొన్ని రోజులు పడుతుందని జిల్లా కలెక్టర్లు కేంద్ర బృందానికి వివరించారు. ప్రతి ఇంటినీ సందర్శించి నష్టాలపై సమగ్ర సర్వే నిర్వహించాలని కేంద్ర బృందం సూచించింది.
నదీగట్లు, కాలువల బలోపేతంపై దృష్టి
ప్రభావిత ప్రాంతాల్లో నదీగట్లు, కాలువల ఎత్తు పెంచడంతో పాటు వాటిని మరింత పటిష్టం చేయాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు. తాగునీటి మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారులు, వంతెనలకు జరిగిన నష్టాన్ని కూడా సమీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయని, మరికొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాల్సిన అవసరాన్ని కూడా కేంద్ర బృందం పరిశీలించింది. తుఫాన్, వరదల కారణంగా చేపల చెరువులు, పశుసంపదకు కూడా గణనీయమైన నష్టం వాటిళ్లినట్లు సమావేశంలో వెల్లడించారు.
కేంద్ర బృందానికి ప్రాథమిక నివేదిక
వివిధ శాఖలు సమర్పించిన నష్టాల వివరాల ఆధారంగా ఎస్‌ఆర్‌సీ కార్యాలయం రూపొందించిన ప్రాథమిక నివేదికను కేంద్ర బృందానికి అందజేశారు. పునర్నిర్మాణం, నదీగట్ల బలోపేతం తదితర చర్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందించే అంశంపై కూడా బృందం చర్చించింది. అలాగే 1999 నాటి పెను తుఫాన్ నుంచి ఇప్పటివరకు ఒడిశా ఎదుర్కొన్న వివిధ తుపాన్లు, వరదలు తదితర ప్రకృతి విపత్తుల గురించి ప్రధాన కార్యదర్శి అనూగర్గ్ కేంద్ర బందానికి వివరించారు. ఒడిశా ప్రతి ఏడాది అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో విపత్తు నిర్వహణతో పాటు ముందస్తు సన్నద్ధత, వేగవంతమైన బలగాల మోహరింపు, సహాయక చర్యలు, పునరావాసానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్‌లో విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం లక్ష్యంగా రాష్ట్రంలో విపత్తులను తట్టుకునే మౌలిక వసతులు, సంస్థాగత సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నిరంతర చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.


