● అర్నబ్ నష్టాలు అంచనాపై సమీక్ష ● నష్టం అంచనాకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం
భువనేశ్వర్: అర్నబ్ తుఫాన్, తదనంతర వరదలతో ఒడిశాలో సంభవించిన భారీ నష్టంపై కేంద్ర బృందం అంచనా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర బృందం గురువారం లోక్‌సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. తుపాన్లు, వరదలు, వడగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్న నేపథ్యంలో.. తాత్కాలిక సహాయ చర్యలకే పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి రవిశంకర్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే గంజాం, గజపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వరుస ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు తీవ్ర ఆటంకంగా మారుతున్నాయన్నారు. తక్షణ సహాయం, పునరావాసం, పునర్నిర్మాణ చర్యలతో పాటు భవిష్యత్‌లో విపత్తుల ప్రభావాన్ని తగ్గించే దీర్ఘకాలిక, శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తుపాన్లు, వరదలను తట్టుకునేలా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మాఝీ పేర్కొన్నారు. విపత్తులను తట్టుకునే మౌలిక వసతులు, సమర్థవంతమైన వరద నియంత్రణ చర్యలు చేపడితే ప్రజలకు దీర్ఘకాలికంగా రక్షణ కల్పించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా నిరంతరాయంగా కొనసాగుతుందని చెప్పారు.
పూర్తిస్థాయి అంచనాకు మరో 7–8 రోజులు
గంజాం, గజపతి జిల్లాల్లో పలు ప్రాంతాలను పరిశీలించినట్లు కేంద్ర బృందం నాయకుడు రవిశంకర్ తెలిపారు. వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమైనట్లు చెప్పారు. గంజాం జిల్లాలో రుషికుల్యా నది ఉద్ధృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. వ్యవసాయ భూములు, రహదారులు, ఇళ్ల పరిసరాలు, కార్యాలయాలు ఇసుక, మట్టితో కప్పుకుపోయాయని వివరించారు. చాలా ఇళ్లు కూలిపోకపోయినా బలహీనపడ్డాయని, వాటి పరిస్థితిని కూడా సమగ్రంగా పరిశీలించాల్సి ఉందన్నారు. రుషికుల్యా నది పరివాహక ప్రాంతాల్లో పేరుకుపోయిన ఇసుక, మట్టిని దీర్ఘకాలికంగా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తుఫాన్, వరదల వల్ల జరిగిన మొత్తం నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడానికి మరో 7–8 రోజులు పట్టే అవకాశం ఉందని రవిశంకర్ తెలిపారు.
సహాయ చర్యలపై ప్రశంసలు
తుఫాన్, వరదల అనంతరం ఒడిశా ప్రభుత్వం చేపట్టిన వేగవంతమైన సహాయ, పునరావాస చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. రహదారుల్లో దెబ్బతిన్న ప్రాంతాలను చాలావరకు రాకపోకలకు అందుబాటులోకి తీసుకువచ్చారని, విద్యుత్ సరఫరాను కూడా వేగంగా పునరుద్ధరించినట్లు రవిశంకర్ తెలిపారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి తుఫాన్, వరదల వల్ల జరిగిన నష్టం, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరుద్ధరణ చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నష్టంపై ప్రాథమిక అంచనా రూపొందించి, సహాయ, పునరుద్ధరణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి క్లెయిమ్ సమర్పించినట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శాశ్వత్ మిశ్రా, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్ పాఢి, ప్రత్యేక సహాయ కమిషనర్ రాజేష్ ప్రభాకర్ పాటిల్, కేంద్ర బృందం సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


