జయపురం: జయపురంలో ఎంతోకాలంగా ఉన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జయపురం సీనియర్ సిటిజన్స్ కమిటీ సభ్యులు సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం గురువారం అందజేశారు. కమిటీ ఉపాధ్యక్షుడు సత్యానంద పండ నేతృత్వంలో సభ్యులు సబ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. పట్టణంలో డ్రైనేజీ, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి అభిమన్య భటమిశ్ర, సహాయ కార్యదర్శి నరసింహ పాణిగ్రహి, కోశాధికారి భీమషేన్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
కామెర్ల కట్టడికి చర్యలు
భువనేశ్వర్: ఉత్కల్ విశ్వవిద్యాలయంలో కామెర్ల వ్యాప్తి కలకలం రేపిన నేపథ్యంలో అధికారులు నివారణ చర్యలను ముమ్మరం చేశారు. ప్రధానంగా క్యాంపస్‌లోని బాలికల హాస్టల్–6, హాస్టల్–7లో ఉంటున్న విద్యార్థుల్లో కామెర్లు నిర్ధారణ కావడంతో పెద్ద ఎత్తున ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు వైద్య నిపుణులతో కూడిన బృందం సుమారు 400 మంది బాలికా విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు, కామెర్లకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయా అనే దానిపై పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు 12 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు, కేసులను ముందుగానే గుర్తించేందుకు విశ్వవిద్యాలయం చేపడుతున్న నివారణ చర్యల్లో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం భాగమని అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయంలోని బోర్‌వెల్ నీటి సరఫరాను నిలిపివేసి, రెండు బాలికల హాస్టళ్లకు సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ చండీ ప్రసాద్ నందా తెలిపారు. క్యాంపస్‌లోని మొత్తం 12 హాస్టళ్ల నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుభ్రం చేసినట్లు వెల్లడించారు.
అదుపులోకి వచ్చిన పరిస్థితి
మంగళవారం నుంచి కొత్తగా కామెర్ల కేసులు ఏవీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థులు డిశ్చార్జి అయ్యారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిగతా విద్యార్థులు హాస్టళ్లలోనే ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటున్నారు.
టెక్కలి రూరల్: గోపినాథపురం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దింటి బాలాజీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నరోకళ్లపల్లి గ్రామానికి చెందిన పి.బాలాజీ తన ద్విచక్ర వాహనంపై టెక్కలి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


