● గాలిస్తున్న నేవీ సిబ్బంది ● సీహెచ్ కపాసుకుద్ధిలో విషాదఛాయలు
కవిటి : సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బడే కూర్మారావు(36) గోవాలోని పాంజ ప్రాంతంలో సముద్రంలో వేట సాగిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. బుధవారం అర్ధరాత్రి సమాచారం చేరడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బడే కూర్మారావు ఉపాధి నిమిత్తం వారం రోజుల కిందట గోవా రాష్ట్రం పంజా ప్రాంతానికి చేపల వేటకు వలస వెళ్లాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బోటులో 20 మంది మత్స్యకారులతో కలిసి వేట ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తూ సముద్రంలో జారిపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తోటి మత్స్యకారులు గమనించి బోటులో వెతకగా కూర్మారావు కనిపించలేదు. వెంటనే వారు సముద్రంలో గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. గోవా తీరంలో విధులు నిర్వహిస్తున్న నేవీ అధికారులకు సమాచారం వెంటనే సిబ్బందిని పంపించి బుధవారం తెల్లవారుజాము నుంచి గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కూర్మారావుకు భార్య కూర్మమ్మ, కుమారుడు శంకర్ (6వ తరగతి), కుమార్తె జ్యోతి (2వ తరగతి), తల్లిదండ్రులు ఢిల్లమ్మ, జోగారావు ఉన్నారు. కూర్మారావు ఆచూకీ త్వరగా గుర్తించి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు జిల్లా యంత్రాంగాన్ని, మత్స్యశాఖ అధికారులను కోరుతున్నారు.


