పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల నిర్వాహణకు జిల్లా యంత్రాంగం ముమ్మరంగా సన్నాహాలు చేపడుతోంది. 70వ రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2026–27, జిల్లా స్థాయి ముఖ్యమంత్రి ట్రోఫీ 3.ఓ నిర్వహణపై కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్ అధ్యక్షతన కలెక్టరేట్లో గురువారం సన్నాహాక సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లా ముఖ్యవిద్యాధికారి డా.మయాధర్ సాహు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సల్మాన్ రైకా, డీసీఏబీ డీఎస్పీ ఠాకూర్ దాస్ ముర్ము, జిల్లా క్రీడాధికారి త్రినాథ కుమార్ సాహు ప్రముఖంగా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలు నవంబర్ 10 –13 వరకు రాయఘడ బ్లాక్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరగనుంది. ఒడిశా స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఓస్సా) ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీల్లో రాష్ట్రంలో 30 జిల్లాల నుంచి 14 ఏళ్లలోపు, అండర్–17 వయస్సు కలిగిన బాలబాలికలు పాల్గొంటారు. బ్లాక్, గ్రామస్థాయిలో క్రీడాకారుల్లో దాగివున్న క్రీడా ప్రతిభను గుర్తించి వారు ఇంకా ఎదిగేలా అవకాశం కల్పించడం ఈ ఛాంపియన్ షిప్ పోటీల ఉద్దేశమని కలెక్టర్ అగర్వాల్ అన్నారు. సమావేశంలో జిల్లా శారీరక విద్యాధికారి సురేంద్ర కుమార్ పాత్రో, వివిధ బ్లాక్ క్రీడా శాఖ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


