ఏపీలో ఎన్నికల వేళ కొనసాగుతున్న
ఉద్రిక్తతలు
నేరడివలసలో మోహరించిన బీజేడీ శ్రేణులు
కొరాపుట్:
కొఠియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం వేకువజాము నుంచి ప్రతిపక్ష బీజేడీ కార్యకర్తలు వందలాదిగా కొఠియా పంచాయతీ నేరడివలసలో మెహరించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల ప్రభుత్వ యంత్రాంగం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో వీరంతా అక్కడికి చేరుకున్నారు. అంతకుముందు ఆంధ్రా పోలీసులు స్థానికుల సాయంతో ఒడిశా పోలీసుల చెక్‌పోస్టులు తొలగించడంతో సమస్య మరింత ముదిరింది. విషయం తెలుసుకున్న బీజేడీ నాయకులు అర్ధరాత్రి నేరడివలసలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో పార్టీలకు అతీతంగా ఐక్యంగా కొఠియా చేరుకున్నారు. రోజంతా ఆందోళన చేపట్టారు. బీజేడీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌మజ్జి, మాజీ ఎంపీ జిన్ను హిక్కా, మాజీ ఎమ్మెల్యేలు పీతం పాఢీ, రఘురాం పొడాల్, ప్రభుజానీ, కొరాపుట్ జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక తరలివచ్చారు. మరోవైపు అధికార బీజేపీకి చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచో నేతృత్వంలో బృందం కొఠియా ప్రజలకు నచ్చజెప్పారు. మాజీ ఎంపీ జయరాం పంగి కొఠియా గ్రామాల్లో ఒడిశాకు మద్దతుగా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ఒడిశా ప్రభుత్వం 7 ప్లాటున్ల పోలీసులను కొఠియా నలువైపులా పహారా కాస్తున్నారు. ముందు రోజు తొలగించిన బారికేడ్లు, టెంట్లు, చెక్‌పోస్టులు తిరిగి ఏర్పాటు చేశారు. కొఠియాలో కొరాపుట్ జిల్లా యంత్రాంగం 166 సెక్షన్ అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


