ఒడియా ప్రభుత్వ సేవలు అందకపోవడంతో గుర్రుగా ఉన్న స్థానికులు
ఆంధ్రా ఎన్నికల్లో పాల్గొంటామంటూ అక్కడి అధికారులకు వినతి
రంగంలోకి దిగిన బీజేడీ, కాంగ్రెస్ నేతలు
మల్కన్‌గిరి : చిత్రకొండ సమితి స్వభీమాన్ ఏరియా ధూలిపూట్ పంచాయతీలో ఉన్న జుమ్‌డాంగ్ గ్రామం మరో కొఠియాగా మారనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. విద్య, వైద్యం, అంగన్‌వాడీ.. ఇలా ప్రభుత్వ సేవలు, పథకాల కోసం ఇక్కడి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆధారపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జుమ్‌డాంగ్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయమై ఒడిశా పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్య ,వైద్యం, అంగన్‌వాడీ సేవలు అందించడం, ప్రతి గ్రామస్తుడికి ఒడిశా ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం, ఇతర గ్రామాల మాదిరిగా సమాన హక్కులు కల్పించడం వంటి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో మరో కొఠియాగా మారే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, గురువారం జరిగే ఆంధ్రా పరిషత్ ఎన్నికల్లో తాము ఓట్లు వేస్తామని, అల్లూరి జిల్లాలోనే తమను ఉంచాలని కోరుతూ అల్లూరి జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలువురు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్కే ఆరా తీశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సమరి తాంగులు, చిత్రకొండ సమితి చైర్‌పర్సన్ రాజేశ్వరీ ఖీలో, మల్కన్‌గిరి మాజీ ఎమ్మెల్యే మానాస్ మడ్కామి, దూలిపూట్ పంచాయతీ సభ్యులు కూడా కలెక్టర్‌ను కలిశారు.


