భువనేశ్వర్: పార్కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సగం కాలిన మృతదేహం బయటపడటం తీవ్ర కలకలం రేపింది. భువనేశ్వర్‌లోని గొడొకొనా ప్రాంతంలో కేలూ చరణ్ పార్కు సమీపంలో బుధవారం ఈ భయానక ఘటన వెలుగుచూసింది. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. మరోచోట వ్యక్తిని హత్య చేసిన అనంతరం, మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నిప్పంటించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి గుర్తింపును చెరిపేసి, నేరానికి సంబంధించిన ఆనవాళ్లను మాయం చేసేందుకే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు, నమూనాలను సేకరించాయి. మృతదేహంపై తీవ్ర కాలిన గాయాలు ఉండటంతో పాటు, బాధితుడు ధరించిన చొక్కా సైతం పూర్తిగా కాలిపోయినట్లు గుర్తించారు. మృతదేహం కొన్ని రోజులుగా అక్కడే పడి ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యక్తిని ముందుగా హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని కాల్చివేశారా? లేక గుర్తింపును గల్లంతు చేసేందుకు ఈ విధంగా చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
రాయగడ: రైల్వే విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లకు వార్షిక జీవన ధ్రువీకరణ పత్రం సమర్పణ ప్రక్రియను మరింత సులభతరంగా చేసేందుకు తూర్పు కోస్తా రైల్వే రాయగడ డివిజన్ ఆధ్వర్యంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రచారం 5.0 నిర్వహిస్తున్నారు. నవంబర్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో పెన్షనర్లు డిజిటల్ విధానంలో లైఫ్ సర్టిఫికెట్లు రూపొందించి సమర్పించుకునేందుకు అవసరమైన సహాయం, మార్గదర్శకత్వం అందిస్తున్నారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ ప్రక్రియను వేగవంతం చేయడం, సరళీకృతం చేయడం, పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులను తగ్గించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. విశ్రాంత రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ పెన్షనర్లు సులభంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు
ప్రచారంలో భాగంగా రాయగడ డివిజన్ ప్రధాన కార్యాలయంతో పాటు కొరాపుట్, జగదల్‌పూర్, అరకు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. రాయగడలో డివిజనల్ రైల్వే మేనేజరు (పర్సనల్ ) కార్యాలయంతో పాటు ఆయా ప్రాంతాల్లో నిర్ధేశిత కార్యాలయాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. శిబిరాలకు వచ్చే పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తయారీ, సమర్పణ ప్రక్రియపై సిబ్బంది ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు. అవసరమై సాంకేతిక సహాయం అందిస్తూ ధ్రువీకరణ పత్రం సమర్పణ సజావుగా పూర్యయ్యేలా మార్గదర్శకతం చేస్తున్నారు.
80 ఏళ్లు పైబడిన ప్రాధాన్యత
వయోభారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన అత్యంత సీనియర్ పెన్షనర్లకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక సహాయం అందిస్తున్నారు. వారికి ప్రాధాన్యతనిస్తూ లైఫ్ సిర్టిఫికెట్ మర్పర్పణ ప్రక్రియ సౌకర్యవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు.
రైతులను ఆదుకోవాలి
పర్లాకిమిడి: గుసాని బ్లాక్‌లో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి బుధవారం పర్యటించారు. అగర్ ఖండి, ఒంగుళ, బాపూజీపేట, బాగుసల, బడగాం గ్రామాల్లో నేలకొరిగిన వరి పంటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌తో మాట్లాడి వ్యవసాయ అధికారులను పంపించాలని కోరారు. రైతులకు నష్టపరిహారం అందేవరకు పోరాడతానని విలేకరులకు వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ఎస్.బాలరాజు, నీలమాధవ పాఢి, బిజయ జెన్నా, నిరంజన్ ప్రధాన్ పాల్గొన్నారు.


