రైల్వే సేష్టన్‌లో ఆహార నాణ్యత,
పరిశుభ్రతపై అవగాహన
రాయగడ: రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆహార వృథాను అరికట్టడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా తూర్పు రైల్వే రాయగడ డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్రిక్స్ స్థిరమైన జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బాధ్యతాయుత ఆహార వినియోగం, ఆహార వృథా నివారణ, పర్యావరణహిత ఆహార అలవాట్లపై ప్రయాణికులు, ఆహరా విక్రేతలు, రైల్వే సిబ్బందికి అవగాహన కల్పించారు. రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ఆహారాన్ని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని, అనవసరంగా వృథా చేయకూడదని, పర్యావరణ పరిరక్షణకు ప్రతీఒక్కరూ తమవంతు బాధ్యత నిర్వహించాలని అధికారులు సూచించారు. డిజిటల్ డిస్‌ప్లేలు, ఆహార విక్రయ కేంద్రాలు, స్టాళ్ల వద్ద పొస్టర్ల ప్రదర్శన, ప్రజా ప్రకటనలు, ప్రయాణికులు, విక్రేతలతో ప్రత్యక్ష సంభాషణల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాయగడ రైల్వే డివిజనల్ మేనేజరు అమితాబ్ సింఘాల్ మాట్లాడుతూ.. స్థిరమైన ఆహార వినియోగ విధానాలను అనుసరించడం పర్యావరణ పరిరక్షణకు, సహాజ వనరుల సమర్థ వినియోగానానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆహార వృథాను తగ్గిండం అనేది కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యత కూడా అని స్పష్టం చేశారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికులు, ఆహార విక్రేతలు సమిష్టిగా కృషి చేసి, పరిశుభ్రమైన, పర్యావరణహిత రైల్వే వాతావరణాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.
ఆహార విక్రయ కేంద్రాల్లో నాణ్యత పరిశీలన
అవగాహన కార్యక్రమంలో భాగంగా రైల్వే వాణిజ్య అధికారులు, వాణిజ్య తనిఖీ సిబ్బంది వివిధ స్టేషన్లలోని ఆహార విక్రయ కేంద్రాలు, స్టాళ్లను తనిఖీ చేశారు. ప్రయాణికులకు అందించే ఆహార పదార్ధాల నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాల అమలును పరిశీలించారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఆహారాన్ని అందించాలని విక్రేతలకు సూచించారు.


