రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీలోని 1 నుంచి 19 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించి రూ.2.41 కోట్ల విలువైన మానవ వనరుల సరఫరా టెండర్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. టెండర్ ప్రక్రియ ప్రారంభమై సుమారు ఆరు నెలలు గడిచినా సాంకేతిక మూల్యాంకన ప్రదర్శన (టెక్నికల్ ఎవాల్యూషన్ ప్రజెంటేషన్ ) పూర్తి కాకపోవడంపై ఇప్పటికే పలు అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 5న జరగాల్సిన ప్రదర్శనను ఒకరోజు ముందు జరిపి నవంబరు 4న నిర్వహించాలని మున్సిపాల్టీ అధికారులు నిర్ణయించారు. మున్సిపాల్టీ కార్యాలయం జారీ చేసిన లేఖ ప్రకారం తొలుత నవంబరు 5వ తేదీ ఉదయం సాంకేతిక మూల్యాంకన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం తేదీని మార్చి నవంబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు గుణుపూర్ మున్సిపాల్టీ కౌన్సిల్ కార్యాయలంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్, గుణుపూర్ అసిస్టెంట్ కలెక్టర్, గుణుపూర్ సమితి ఫైనాన్స్ అధికారి, రాయగడ మున్సిపాల్టీ ఇంజినీర్ హాజరుకావాలని అధికారిక లేఖ ద్వారా కోరారు.
గతంలో టెండర్ ఫిక్సింగ్ ఆరోపణలు..
ఈ టెండర్ వ్యవహారం గతంలోనూ వివాదాలకు కేంద్రంగా నిలిచింది. 2024–25లో నిర్వహించిన సాంకేతిక మూల్యాంకన ప్రదర్శన సందర్భంగా అక్రమాలు జరిగాయని, టెండర్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో ప్రదర్శనకు సంబంధించిన వీడియో సీడీ అందించి, మొత్తం ప్రక్రియను తిరిగి పరిశీలించాలని డిమాండ్లు వచ్చినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత టెండర్ ప్రక్రియలోనూ ఆరు నెలల జాప్యం చోటు చేసుకోవడం, సాంకేతిక మూల్యాంకన ప్రదర్శన ఆలస్యంగా నిర్వహించనుండటం పలు సందేహాలకు తావిస్తోంది. ముఖ్యంగా టెండర్‌లొ పాల్గొన్న సంస్థల వివరాలను వెల్లడించేందుకు మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంతోష్ కుమార్ నాయక్ నిరాకరించినట్లు సమాచారం. టెండర్ జాప్యానికి కారణాలపై కూడా ఆయన నుంచి ఎటువంటి సంతృప్తికరమైన వివరణ అభించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, గత రెండేళ్లుగా మున్సిపాల్ అధికారుల ఆదరణ పొందుతున్నట్లు ప్రచారంలో ఉన్న ఎంఎస్ సవ్యసాచి మహాకుల్ సంస్థ పేరు ఈ టెండర్ వ్యవహారంలో చర్చకు వస్తున్నట్లు స్థానికంగా పలువురు పేర్కొంటున్నారు. ఈ అంశాలపై అధికారిక నిర్ధారణ లేదు.
రు.2.40 కోట్లకు పైగా విలువ.. 19 వార్డుల పారిశుధ్య నిర్వహణ
టెండర్ రిఫరెన్స్ నంబర్ 1339, తేదీ 2026 ఏప్రిల్ 16వ తేదీగా మున్సిపాలిటీ లేఖలో పేర్కొన్నారు. ప్రచురిత టెండర్ వివరాల ప్రకారం ఈ పనుల అంచనా విలువ రూ.2,20,80,510 ఉంది. ఈ టెండర్ పరిధిలో పట్టణంలోని రహాదారులు, డ్రైనేజీల శుభ్రత, చెత్త సేకరణ, గడ్డి తొలగింపు తదితర పారిశుధ్య పనులు చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 19 వార్డుల పారిశుధ్య నిర్వహణ ఈ టెండర్‌పై ఆధానపడి ఉండటంతో ఈ ప్రక్రియలో జాప్యం కొనసాగితే పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యంపై ప్రభావం పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పారదర్శకతపై అనుమానాలు..
రు. 2.41 కోట్ల ప్రజాధనంతో చేపట్టనున్న ఈ టెండర్ ప్రక్రియ జాప్యానికి అసలు కారణాలేమిటి. సాంకేతిక మూల్యాంకనలో అనుసరిస్తున్న ప్రమాలేమిటి... ప్రజెంటేషన్ తేదీ మార్పుకు కారణాలేమిటి... టెండర్‌లో పాల్గొన్న అన్ని సంస్థలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారా... అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టెండర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి కాలపట్టిక, సాంకేతిక అర్హతల పరిశీలన వివరాలు, మూల్యాంకన ప్రమాణాలు, పాల్గొన్న సంస్థల జాబితా, టెండర్ ఖరారుకు నిర్దేశించిన గడువును బహిర్గతం చేయాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖతోపాటు జిల్లా యంత్రాంగం కూడా పర్యవేక్షణ చేపట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజల పన్నుల రూపంలో సమకూరిన నిధులతో, జావాబూదారీతనం, సమాన అవకాశాలు కల్పించడం, మున్సిపాలిటీ యంత్రాంగం బాధ్యత.


