మాట్లాడుతున్న సీడబ్లూసీ సభ్యుడు ప్రేమానంద బెహరా
మోహనా బ్లాక్‌లోని పలు మిషనరీ, బోర్డింగ్ హోస్టలర్స్ ప్రతినిధులు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో మోహనా బ్లాక్‌లోఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు వసతి కల్పిస్తున్న అనేక మిషనరీ రెసిడెన్సియల్ పాఠశాలలు, క్రిస్టియన్, ఇతర సంస్థల యజమానులతో జిల్లా శిశు సురక్షా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శిశు సంరక్షణ సమితి అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, ప్రొటెక్షన్ అధికారి (డి.సి.పి.ఓ.) డంబురోధర బలవంత్, సీడబ్ల్యూసీ సభ్యు లు ప్రేమనంద బెహరా, ఉమన్ హెల్ప్‌లైన్ సబ్ కోర్డినేటర్ ఎల్.రాంప్రసాద్ తదితరులు హాజరయ్యారు. మోహనా నియోజకవర్గంలో నడుస్తున్న బాలబాలికల హోస్టల్స్‌లో కంధమల్, బ్రాహ్మాణిగాం, రాయగడ జిల్లాల విద్యార్థుల వివరాలు ప్రభుత్వానికి అందజేయాలన్నారు. వారి బాగోగులు, ఆరోగ్యం, వసతి సదుపాయాలపై ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు విడుదల చేసిందన్నారు. అందువల్ల పిల్లల ఆరోగ్యంపై తగిన చర్యలు చేపట్టాలని సంరక్షణ అధికారి డంబురుఓదోరో బలవంత్ అన్నారు. మోహనా సరిహద్దులో గరడమా, మంద్రబాజు, మోహనా, రాయిపంక, బిరికోట్‌లో అనాధ బాలబాలికలను ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రానికి తరలించాలని, వారిబాగోగులు ప్రభుత్వమే భరిస్తుందని డీసీపీఓ అరుణ్‌కుమార్ త్రిపాఠి తెలి యజేశారు. అనాధ బాలబాలికలు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు హోస్టల్స్‌లో భద్రత, సరైన సౌకర్యాలు కల్పించాలని, లేకుంటే ఆ సంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలపై చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మోహనాలో పలు మిషనరీ కాన్వెంట్ పాఠశాలలు, ప్రైవేటు హోస్టలర్స్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొని వారి సందేహాలను అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు.


