● మంత్రి సురేశ్ పూజారి ఆదేశం
● మూడు జిల్లాలకు నలుగురు ఐఏఎస్‌ల నియామకం
భువనేశ్వర్: అర్నబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన గంజాం, గజపతి, కంధమల్ జిల్లాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేశ్ పూజారి అధికారులను ఆదేశించారు. నష్టాల అంచనా, బాధితులకు పరిహారం పంపిణీ, దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల తీరం దాటిన మురసు తుఫాన్ పరిస్థితిని సైతం సమీక్షించారు. మురసు తుఫాన్ సోమవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించిందని, ప్రస్తుతం విజయవాడకు దక్షిణంగా కొనసాగుతూ తెలంగాణ వైపు కదులుతోందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఒడిశాలోని ఏ జిల్లాపైనా తుఫాన్ ప్రభావం గణనీయంగా లేదన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించారు. పూరీలో అత్యధికంగా 12 మిల్లీమీటర్లు, మల్కన్‌గిరి, కొరాపుట్, గంజాం జిల్లాల్లో 10 మిల్లీ మీటర్లు లేదా అంతకంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
1.65 లక్షల మందికి పైగా తరలింపు
ప్రస్తుత పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు గంజాం జిల్లాలో 1,52,010 మంది, గజపతిలో 620 మంది, మల్కన్‌గిరిలో 5,073 మంది, కొరాపుట్‌లో 1,101 మంది, కంధమల్‌లో 6,269 మంది, రాయగడలో 736 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మొత్తంగా 1,65,809 మందిని తరలించగా, ఆయా జిల్లాల్లో 592 శాశ్వత, తాత్కాలిక పునరావాస కేంద్రాలు పనిచేస్తున్నాయని వివరించారు. సహాయక చర్యల కోసం 54 ఓడ్రాఫ్, 9 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు 100కు పైగా అగ్నిమాపక సేవల బృందాలను రంగంలోకి దించారు. జిల్లా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు ఎక్కువగా మూసివేసి ఉన్నాయని, పరిస్థితులను బట్టి వాటిని తిరిగి తెరవడంపై సంబంధిత జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని మంత్రి తెలిపారు.
నలుగురికి అదనపు బాధ్యతలు
అర్నబ్ తుఫాన్ కారణంగా ఇళ్లు, వ్యవసాయ భూములు, వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాలకు ముఖ్యమంత్రి ఇప్పటికే పరిహార ప్యాకేజీ ప్రకటించారని మంత్రి గుర్తుచేశారు. దెబ్బతిన్న మౌలిక వసతుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ప్రజాపనులు, ఇంధన, జలవనరుల శాఖలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాయని తెలిపారు. నష్టాల అంచనాను త్వరితగతిన పూర్తి చేయడం, బాధితులకు సకాలంలో పరిహారం అందించడం, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడం, జిల్లా యంత్రాంగంతో సమన్వయాన్ని బలోపేతం చేయడం కోసం 3 జిల్లాలకు నలుగురు ఐఏఎస్ అధికారులను పూర్తి అధికారాలతో అదనపు ప్రత్యేక సహాయ కమిషనర్లుగా (అదనపు ఎస్‌ఆర్‌సీలు) నియమించినట్లు వెల్లడించారు. వారిలో గజపతి జిల్లాకు పవన్ కుమార్, గంజాం జిల్లాకు అజిత్ కుమార్ మరియు తేజస్విని బెహెరా, కంధమల్ జిల్లాకు శివ మాలవ్య నియమితులయ్యారు.
కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన
తుఫాన్ నష్టాలను అంచనా వేసేందుకు ఒడిశాలో పర్యటిస్తున్న కేంద్ర బృందం మంగళవారం గజపతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. బుధవారం గంజాం జిల్లాలో పర్యటించి నష్టాలను అంచనా వేసిన అనంతరం భువనేశ్వర్‌కు తిరిగి రానుంది. కేంద్ర బృందం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తున్నారు. ప్రాథమిక నష్టం అంచనా నివేదికలను వీలైనంత త్వరగా సమర్పించాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అనంతరం సమగ్ర తుది నివేదికలను రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు వెల్లడించారు. తుఫాన్ బాధితులకు అవసరమైన సహాయం, ఉపశమన చర్యలు, నిత్యావసర సదుపాయాలు ఎలాంటి జాప్యం లేకుండా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూగర్గ్, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్ కుమార్ పాఢీ, ప్రత్యేక సహాయ కమిషనర్ రాజేశ్ ప్రభాకర్ పాటిల్, అగ్నిమాపక సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాంశు షడంగి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


