యువకుడిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

యువకుడిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్‌

శ్రీకాకుళం క్రైమ్‌ : ఆమదాలవలస మున్సిపాలిటీలోని కొత్త కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్‌ అనే యువకుడిపై పీఐటీ ఎన్డీపీఎస్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫిక్‌ ఇన్‌ నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌ స్టాన్సెస్‌) యాక్ట్‌ నమోదైంది. రాష్ట్ర రెవెన్యూ (ఎకై ్సజ్‌) శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌ కుమార్‌ మీనా ఈ మేరకు ముందస్తు నిర్బంధ (సెక్షన్‌ 3(1)) ఉత్తర్వులు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డికి మంగళవారం జారీ చేశారు. జగదీష్‌ ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలకే కాక ఇతర జిల్లాల్లోని విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు ఎస్పీ తన విచారణలో తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో తక్షణమే విశాఖ సెంట్రల్‌ జైల్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్‌ ఆత్మహత్య

మెళియాపుట్టి: భారత సైన్యంలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ మరికొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చెంది కుటుంబంతో సంతోషంగా గడపాల్సిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మెళియాపుట్టి మండలంలో చోటుచేసుకుంది. చాపర గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ నక్క నారాయణరావు(40) ఆదివారం జమ్మూకాశ్మీర్‌లో సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియలేదు. నారాయణరావుకు భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం చాపర గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

బొలెరోను ఢీకొన్న లారీ

మందస: బాలిగాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి అరటి పండ్ల లోడుతో ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బొలెరో వాహనం రాజమండ్రి నుంచి ఒడిశాకు వెళ్తుండగా టైరు పంక్చర్‌ కావడంతో రోడ్డు పక్కన ఆపి ఉంచగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తలసేమియా బాధితులకు రక్తమార్పిడి

శ్రీకాకుళం కల్చరల్‌ : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తమార్పిడి కేంద్రంలో తొమ్మిది మంది తలసేమియా బాధితులకు డాక్టర్‌ వండాన సచిత్ర పర్యవేక్షణలో మంగళవారం రక్తమార్పిడి చేశారు. చైర్మన్‌ జగన్మోహనరావు ఆధ్వర్యంలో బాధితులకు రవాణా ఖర్చులు, భోజన వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆయుష్‌ వైద్యులు ఎం.మంగమ్మ పర్యవేక్షణలో యోగా టీచర్‌ గాయత్రి యోగా ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ మేనేజర్‌ కె.సత్యనారాయణ, సుజాత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి

టెక్కలి: టెక్కలి–3 వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి సత్తారు ఉషారాణిపై అదే ప్రాదేశికం టీడీపీ అభ్యర్థి ధవళ ఈశ్వరిబాయి మరిది శ్రీను మంగళవారం దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై అభ్యర్థి సత్తారు ఉషారాణి, ఆమె భర్త సత్తారు సత్యం, కుమారుడు పృథ్వీతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్‌ తదితరులు టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ప్రకారం.. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో, ఉషారాణి తన ప్రాదేశికంలో ప్రచారం చేస్తుండగా టీడీపీ అభ్యర్థి మరిది శ్రీను ఆ ప్రాదేశికానికి చేరుకుని ఆమైపె దురుసుగా ప్రవర్తించడంతో పాటు సెల్‌ఫోన్‌, కరపత్రాలను దౌర్జన్యంగా లాక్కున్నారని అంతే కాకుండా భౌతికంగా దాడి చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై టార్గెట్‌ చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ఐదు సార్లు ఎంపీటీసీగా గెలుపొందిన తనపై మహిళ అనే కనీస మానవత్వం లేకుండా దాడికి పాల్పడ్డారని వాపోయారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement