● తీర్పువెలువడిన వెంటనే నిందితుల్లో ఒకరు పరారు
● కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్తత
రాయగడ: జిల్లాలో సంచలనం సృష్టించిన కిడ్నాప్, అసహజ లైంగిక దాడి, హత్యాయత్నం కేసులో తొమ్మిది మంది నిందితులకు రాయగడ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అల్పనా స్వాయిన్ ఈ తీర్పును ప్రకటించారు. నిందితులను దోషులుగా నిర్ధారించడంతో పాటు ఒకొక్కరిపై రూ.1,000ల నుంచి రూ.20 వేల వరకు జరిమానా విధించారు. జరిమానా చెల్లించలేని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఇదీ విషయం...
2019 నవంబర్ 18వ తేదీన రాయగడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లడ్డ రైల్వేస్టేషన్ సమీపంలో చైన్నె నుంచి ఝార్సుగుడకు రైలులో ప్రయాణిస్తున్న ఒక యువకుడిని నిందితులు అపహరించారు. సదరు యువకుడిని రైతులోనే అడ్డుకున్న నిందితులు, అతడు గంజాయి రవాణా చేస్తున్నాడంటూ బెదిరించారు. తమకు రూ.10 లక్షలు చెల్లిస్తే విడిచిపెడతామని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై సదరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులపై నిందితులు కాల్పులకు పాల్పడగా, పోలీసులు కూడా ప్రతిఘటించినట్లు కేసు వివరాల్లో పేర్కొన్నారు.
తొమ్మిది మందిపై నేరం రుజువు
ఈ కేసులో అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ రిగన్ కిండో దర్యాప్తు నిర్వహించారు. అనంతరం రాయగడ కోర్టులో జీఆర్ కేసుగా విచారణ కొనసాగింది. నేరం రుజువైన నిందితుల్లో హడపా శివ, జి.బంగారు, సుండి సూరజ్, సుండి ప్రకాష్, రాజా మాఝి, జోసెప్ మాఝి, జి.వేణు, జి.తేజ, జి.సురేంద్రలు ఉన్నారు. ఈ కేసులో ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రజత్ రంజన్ ఖటువ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా మొత్తం 36 మంది సాక్షులు తమ వాగ్మూలాలు ఇచ్చారు. తీర్పు వెలువడిన అనంతరం నిందితుల కుటుంబ సభ్యులు కోర్టు ప్రాంగణంలో ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్‌డీపీవో గౌరహరి సాహు పోలీసు బృందంతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు కోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడినట్లు సమాచారం అందుకున్న నిందితుడు సుండి ప్రకాష్ కోర్టు ప్రాంగణం నుంచి పరారైనట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.


