వజ్రపుకొత్తూరు రూరల్: చీపురుపల్లి పంచాయతీ డెప్పూరులో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కాట నారాయణమ్మ వారం రోజుల క్రితం ముంబైలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లింది. ఇంట్లో ఎవరు లేకపోవడాన్ని గుర్తించిన దుండగులు కట్టర్ సాయంతో తలుపులను కట్ చేసి లోపలికి ప్రవేశించారు. బీరువా తలుపులు పగలుగొట్టి రూ.50 వేలు నగదు, బంగారం గొలుసు పట్టుకుపోయారు. బాధితరాలి తల్లి సీరం లోలాక్షి ఎప్పటిలాగే ఉదయం పూల కోసం కుమార్తె ఇంటి వైపు వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ నీహార్ తెలిపారు.
శ్రీకాంత్‌కు వేదవ్యాస పురస్కారం
శ్రీకాకుళం కల్చరల్ : ఒడిశా రాష్ట్రం రూర్కెలాలోని భంజ కళా కేంద్రంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక జాతీయ వేదవ్యాస సంగీత నృత్య మహోత్సవంలో శ్రీకాకుళం నగరానికి చెందిన ప్రముఖ నాట్య గురువు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్‌కు వేదవ్యాస పురస్కారంతో సత్కరించారు. 13 మంది శిష్య బృందంతో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించి ఆహూతులను అలరించారు. కూచిపూడి నాట్య సంప్రదాయంలో మహాగణపతిం, కదిరి నృసింహుడు, నందకధర, ఓంకార రూపిణీ తదితర అంశాలను ప్రదర్శించారు.
జాతీయ నడక పోటీలకు కవిటి విద్యార్థి
కవిటి : రాష్ట్ర పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి నడక పోటీల్లో కవిటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఒరియా) విద్యార్థి మధోర బెహరా అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్ 24న శ్రీకాకుళంలో నిర్వహించిన 5 కిలోమీటర్ల నడక పోటీల్లో మధోర విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఇందులో భాగంగా మంగళవారం కర్నూలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి 5 కిలోమీటర్ల నడక పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసి ప్రథమ స్థానంలో నిలిచాడు. త్వరలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి నడక పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని కోచ్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కె.పద్మనాభ రెడ్డి, మొగిలిపురి సతీష్ అభినందించారు.
దాతలు స్పందించాలి..
మధోర బెహరా పేద కుటుంబం కావడంతో పోటీలకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు భారంగా మారాయి. మధ్యప్రదేశ్‌లో జరగనున్న పోటీలకు ప్రయాణ, ఇతర ఖర్చుల కోసం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదని, జాతీయస్థాయిలో రాష్ట్రానికి పేరు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్న ఈ విద్యార్థికి దాతలు, క్రీడాభిమానులు తమ వంతు సహాయం అందించాలని సతీష్ కోరారు.


