భువనేశ్వర్: ప్రముఖ న్యూరో సర్జన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అశోక్ కుమార్ మహాపాత్రో (73) కన్నుమూశారు. నాలుగు దశాబ్దాలకు పైగా వైద్య రంగంలో విశేష సేవలందించిన ఆయన మృతి వైద్య ప్రపంచానికి తీరని లోటుగా మిగిలింది. దేశంలోని ప్రముఖ న్యూరో సర్జన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన శస్త్ర చికిత్సా నైపుణ్యంతో పాటు వైద్య విద్య, పరిశోధన రంగాల్లోనూ విశేష కృషి చేశారు. ఆయన 1952 డిసెంబర్ 29న ఒడిశాలోని పూరీ జిల్లాలో జన్మించారు. 1975లో బెర్హంపూర్‌లోని ఎంకేసీజీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో ఉన్నత శస్త్రచికిత్సా శిక్షణ పొందారు. 1983లో ఎయిమ్స్ ఢిల్లీలో అధ్యాపకుడిగా చేరి, న్యూరో సర్జరీ విభాగాధిపతిగా సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 2006 నుంచి 2009 వరకు లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జీపీజీఐఎంఎస్) డైరెక్టర్‌గా సేవలందించారు. 2012లో భువనేశ్వర్ ఎయిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
కవలల శస్త్ర చికిత్సతో జాతీయ గుర్తింపు
2017లో ఢిల్లీ ఎయిమ్స్‌లో అతుక్కుని జన్మించిన జగ, బలియా అనే కవల పిల్లలకు విజయవంతంగా వేర్పాటు శస్త్రచికిత్స నిర్వహించడంలో కీలక పాత్ర పోషించి జాతీయ స్థాయిలో అశోక్ కుమార్ గుర్తింపు పొందారు. న్యూరో సర్జరీ పరిశోధనలు, వైద్య విద్య అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. వందలాది పరిశోధనా పత్రాలతో పాటు పలు వైద్య గ్రంథాలను ప్రచురించారు. వైద్య రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2025లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన మరణం దేశ వైద్య రంగానికి, ముఖ్యంగా ఒడిశాకు తీరని లోటుగా నిలిచిపోనుంది. ఆయన మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, విపక్ష నేత నవీన్ పట్నాయక్, పలువురు ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పూరీ స్వర్గద్వార్‌లో మంగళవారం ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు జరిపారు.


