అర్నబ్ తుఫాన్ బాధితులకు ..
భువనేశ్వర్:
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు, వ్యాపారులు, చేతివృత్తులవారు, సామాన్య ప్రజలను ఆదుకునేందుకు ఒడిశా ప్రభుత్వం సమగ్ర సహాయ ప్యాకేజీని ప్రకటించింది. తుఫాన్ అనంతర పరిస్థితులు, సహాయక చర్యలు, పునరుద్ధరణ కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ ప్యాకేజీని వెల్లడించారు. బాధిత వర్గాలు త్వరగా సాధారణ జీవనానికి చేరుకునేలా ఆర్థిక సాయం, రాయితీలు, పునరావాస చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
బాధిత కుటుంబాలకు నగదు, బియ్యం
తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు 50 కిలోల బియ్యంతో పాటు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు మైదాన ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లో రూ.1.30 లక్షల చొప్పున పరిహారం ఇస్తారు. పాక్షికంగా దెబ్బతిన్న పక్కా ఇళ్లకు రూ.6,500, కచ్చా ఇళ్లకు రూ.4,000, గుడిసెలకు రూ.8,000, పూరిపాకలకు రూ.3,000 చొప్పున సాయం అందిస్తారు. పూర్తిగా దెబ్బతిన్న, కొట్టుకుపోయిన లేదా రెండు రోజులకు మించి వరద నీటిలో మునిగిన ఇళ్లలోని కుటుంబాలకు దుస్తుల కొనుగోలుకు రూ.2,500, గహోపకరణాల కోసం మరో రూ.2,500 అందిస్తారు.
రైతులకు పెట్టుబడి రాయితీలు, విత్తనాలు
33 శాతం లేదా అంతకంటే ఎక్కువ పంట నష్టం జరిగిన రైతులకు గరిష్టంగా రెండు హెక్టార్ల వరకు పెట్టుబడి రాయితీ కల్పిస్తారు. వర్షాధార భూములకు హెక్టారుకు రూ.8,500, నీటిపారుదల భూములకు రూ.17,000, బహువార్షిక పంటలకు రూ.22,500 చొప్పున సాయం అందిస్తారు. పంటల రకాన్ని బట్టి కనీస పరిహారాన్ని కూడా నిర్ణయించారు. పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలు, బంకమట్టిని తొలగించేందుకు హెక్టారుకు రూ.18,000 చొప్పున ఇస్తారు. 1.75 లక్షల ప్రత్యేక మినీ విత్తన కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటిలో 1.20 లక్షల పప్పుధాన్యాల కిట్లు, 5 వేల నూనెగింజల కిట్లు, 50 వేల కూరగాయల కిట్లు ఉన్నాయి. దెబ్బతిన్న చెరకు పంటను తిరిగి సాగులోకి తెచ్చేందుకు అంతర పంటల విధానంలో నాట్లు వేసే రైతులకు హెక్టారుకు రూ.27,500, పంట నిర్వహణకు రూ.12,500 చొప్పున అందిస్తారు. 2026–27 రబీ సీజన్లో పురుగుమందులు కొనుగోలుపై 75 శాతం రాయితీ కల్పిస్తారు. పంట నష్టం 33 శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతుల స్వల్పకాలిక ఖరీఫ్ రుణాలను మధ్యకాలిక రుణాలుగా మారుస్తారు. కౌలు, భూమిలేని రైతుల కోసం జాయింట్ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేస్తారు.
పశుసంపద నష్టానికి పరిహారం..
తుఫాన్, వరదల కారణంగా పశుసంపదను కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పాడి పశువులు, గేదెలు చనిపోతే ఒక్కోదానికి రూ.37,500, గొర్రెలు, మేకలు, పందులకు రూ.4,000, కోళ్లకు ఒక్కోదానికి రూ.100 చొప్పున పరిహారం అందిస్తారు. కోళ్ల విషయంలో గరిష్ట పరిమితి రూ.10,000గా నిర్ణయించారు. పెద్ద బరువు మోసే జంతువులకు రూ.32,000, చిన్న బరువు మోసే జంతువులకు రూ.20,000 చొప్పున సాయం చేస్తారు. ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ్ యోజన కింద వెయ్యి మంది రైతులకు మేకలు లేదా ఎద్దుల కొనుగోలుకు సబ్సిడీ అందించనున్నారు. ఐదు వేల మంది పాడి రైతులకు ఒక్కో పశువుకు గరిష్టంగా 500 కిలోల పశుదాణా పంపిణీ చేస్తారు. 70 శాతానికి పైగా దెబ్బతిన్న 200 కోళ్ల ఫారాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తిగా దెబ్బతిన్న పశువుల శాలల పునర్నిర్మాణానికి రూ.1.75 లక్షలు కేటాయించారు. మరోవైపు, తుఫాన్ అనంతర వరద పరిస్థితుల్లో పశువుల ప్రాణరక్షణ, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇందుకోసం 72 త్వరిత స్పందన బృందాలను మోహరించి, 116 పశు వైద్య శిబిరాల ద్వారా సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు 19,582కు పైగా పశువులకు టీకాలు వేయగా, 1,918 పశువులను 31 సురక్షిత ఆశ్రయాలకు తరలించారు. గంజాం జిల్లాలో ప్రత్యేకంగా 23 త్వరిత స్పందన బృందాలు, 55 పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, 87 మెట్రిక్ టన్నుల పశుదాణా, పచ్చిమేత, కుడా పంపిణీకి చర్యలు తీసుకున్నారు. మండలం, ఉపజిల్లా, జిల్లా స్థాయిల్లో నియంత్రణ గదులు పనిచేస్తున్నాయి. బాధిత పశుపోషకులకు తక్షణ సాయం, నష్టపరిహారం అందించే ప్రక్రియను కూడా చేపట్టారు.
మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ
చేపల పెంపకంలో నష్టపోయిన వారికి హెక్టారుకు రూ.1,12,500 చొప్పున, గరిష్ఠంగా 75 శాతం వరకు పరిహారం అందిస్తారు. దెబ్బతిన్న పడవల మరమ్మతులకు రూ.22,500, వలల కొనుగోలుకు రూ.15,000 చొప్పున సాయం చేస్తారు. సముద్ర, తీర ప్రాంత మత్స్యకారులకు దెబ్బతిన్న పడవలకు రూ.60,000, వలలకు రూ.15,000 చొప్పున అందిస్తారు. ఆనకట్టలు తెగిపోవడం వల్ల నష్టపోయిన చేపల పెంపకందారులు, మహిళా స్వయం సహాయక సంఘాల సామూహిక చెరువుల పునరుద్ధరణకు హెక్టారుకు గరిష్టంగా రూ.1.75 లక్షలు కేటాయించారు.
వ్యాపారులు, చేతివృత్తులవారికి ఊరట
తుఫాన్ కారణంగా నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు), వ్యాపారులు, దుకాణదారులకు రూ.12 లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించనున్నారు. ఇందులో గరిష్ఠంగా 25 శాతం, అంటే రూ.3 లక్షల వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. సంచార దుకాణాలు, తాత్కాలిక స్టాళ్లు, కియోస్క్‌లకు రూ.10,000, దుకాణాలు, వాణిజ్య సంస్థలకు రూ.25,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ప్రభావిత ప్రాంతాల్లోని అర్హులైన మహిళా స్వయం సహాయక సంఘాలకు అదనంగా రూ.5,000 ప్రారంభ నిధి అందిస్తారు. చేనేత కార్మికులు, చేతివృత్తుల కళాకారులకు పరికరాల భర్తీకి రూ.5,000, దెబ్బతిన్న ముడిసరుకు కోసం మరో రూ.5,000 చొప్పున సాయం అందిస్తారు.
పట్టు రైతులకు పరిహారం
ఏరి, మల్బరీ, టస్సర్ పట్టు సాగుదారులకు హెక్టారుకు రూ.6,000, మూగా పట్టు రైతులకు రూ.7,500 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
నీటిపారుదల వ్యవస్థల పునరుద్ధరణకు ఆదేశాలు
రబీ సాగుకు ఆటంకం కలగకుండా ప్రభావిత గ్రామాల్లోని ఒడిశా ఎగువ నీటిపారుదల పాయింట్లన్నింటినీ తక్షణమే మరమ్మతు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం పర్యటించనుందని తెలిపారు. ఇదిలా ఉండగా, మరో తుఫాన్ ’మురసు’ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మోహరించిన సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత విధులు నిర్వహిస్తున్న ప్రాంతాలను విడిచి వెళ్లరాదని ముఖ్యమంత్రి ఆదేశించారు.


