పర్లాకిమిడి: స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జాయింట్ గ్రీవెన్స్ సెల్‌కు ఏడీఎం మునీంద్ర హనంగ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి దయామయ పాడీ, ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, తదితరులు హాజరయ్యారు. 59 వినతులు వచ్చాయి. ఇందులో వ్యక్తిగతం 43, గ్రామ సమస్యలకు సంబంధించినవి 16 ఉన్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇద్దరికి రూ.15 వేలను ఏడీఎం అందజేశారు. పలువురు తుఫాన్ బాధితులు కలెక్టర్‌కు ఆర్జీలు పెట్టుకున్నారు. గుసాని బీడీఓ గౌర చంద్ర పట్నాయక్, గుసాని సమితి అధ్యక్షుడు ఎన్.వీర్రాజు, తహసీల్దార్ నారాయ ణ బెహరా, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
భువనేశ్వర్: క్రైస్తవ సంప్రదాయంలో మరణించిన ఆత్మల స్మరణార్థం నిర్వహించే ‘ఆల్ సోల్స్ డే’వేడుకలు జట్నీలో భక్తిశ్రద్ధలతో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా జట్నీ క్రైస్తవ శ్మశానవాటిక అధ్యక్షుడు ఎస్.జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో కోల్‌కత్తా, ముంబై, పూణే, ఖరగ్‌పూర్, విశాఖపట్నం, బరంపురం, కటక్, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహాన బ్లాక్ సమీపంలో జాతీయ రహదారి 326ఏ లెడోబోందో వంతెన ఇటీవల అర్నబ్ తుపానుకు కురిసిన వర్షాలతో అప్రోచ్ రోడ్డు కొట్టుకు పోయింది. వాటి పనులను జాతీయ రహదారి ఇంజినీర్లు యుద్ధ ప్రాతికపదిన నిర్మిస్తున్నారు. ఈ పనులను పరిశీలించడానికి పీడబ్ల్యూడీ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ సింగ్ సోమవారం విచ్చేశారు. లెడోబోందో వంతెన మీదుగా అటు లుహాగుడి, తప్తపాణి, బరంపురానికి ప్రయాణి కులు అవస్థలు పడుతున్నందున వెంటనే మరమ్మతులు పూర్తిచేయాలని సంబఽంధిత ఎన్‌హెచ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుకు చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
మల్లన్న ఆలయంలో చోరీ
● ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
టెక్కలి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి దేవాలయంలోని హుండీ చోరీకి గురైనట్లు సోమవారం ఆలయ సిబ్బంది గుర్తించారు. ఆలయంలోని హుండీ గత నెల 29వ తేదీన వర్షం పడుతుండడం వలన విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు హుండీ తాళం విరగొట్టి నగదు చోరీకి పాల్పడి ఉంటారని సిబ్బంది భావిస్తున్నారు. అయితే గత నెల 29వ తేదీన చోరీ జరిగినప్పటికీ ఇంతవరకు దానిని గుర్తించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఆలయంలో సీసీ కెమెరాలు సైతం కొద్దిరోజులుగా పని చేయకపోవడంతో భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చోరీ విషయాన్ని గ్రామస్తులకు సైతం తెలియకుండా గోప్యంగా ఉంచడానికి కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
సత్యనారాయణకు గుర్తింపు
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళంనకు చెందిన డోలు విద్యాంసుడు ఆచంటి సత్యనారాయణ ఆల్ ఇండియా రేడియో సంగీత పరీక్షల్లో (ఆకాశవాణి) ‘ఏ– గ్రేడ్’ సర్టిఫికెట్ సాధించారు. విజయనగరంలోని సంగీత కళాశాలలో డోలు విద్వాంసునిగా డిప్లొమా పూర్తిచేసి, విశాఖపట్నంలోని కుర్మాపు గోవిందరావు శిక్షణలో శిష్యుడుగా ఉన్నారు. సత్యనారాయణకు సిక్కోలు సంగీత కళాకారులు అభినందనలు తెలిపారు.


