● బిజూ ఛత్ర జనతాదళ్ డిమాండ్
రాయగడ: స్థానిక అటానమస్ కళాశాలలో ఇటీవల నిర్వహించిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విచారణ చేపట్టాలని బీజూ ఛత్ర జనతాదళ్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణికికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల్లో భాగంగా ఈ సమస్య ఆసక్తికరంగా మారింది. బిజూ ఛత్రజనతాదళ్ మద్దతుతో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసిన జగదీష్ నాయక్, ఉపాధ్యక్ష అభ్యర్థి బబులా నాయక్‌లు ఈ ఫిర్యాదును కలెక్టర్ అశుతోష్ కులకర్ణికి సమర్పించారు. ఎన్నికల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన అధికారులు ఎన్నికల ప్రక్రియను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్నికల రోజున బూత్ ఏజెంట్లను కళాశాల ప్రధాన గేటు వెలుపలకు పంపించివేయడం ఎన్నికల పాదర్శకత, పర్యవేక్షణ వ్యవస్ధపై అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం కూడా విద్యార్ధులు నిరసనలు కొనసాగాయని, మరుసటి రోజు వరకు కళాశాల ప్రధాన గేటు ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టడం ఎన్నికల నిర్వహణపై వారిలో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని వివరించారు. ఈ పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఎన్నికల రోజు సీసీ టీవీ పుటేజీని భద్రపరచాలని, బ్యాలెట్ బాక్సుల తరలింపుపై వచ్చిన ఆరోపణలపై విచారించాలని, ఎన్నికల మరుసటి రోజు సమర్పించిన ఎఫ్‌ఐఆర్ నమోదు స్థితిపై స్పష్టత ఇవ్వాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. గత 15 రోజులుగా జిల్లా కలెక్టర్ నుంచి ఉన్నత విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి వరకు ఈ అంశంపై ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


