జయపురం: సమాజంలో కార్మికులు, శ్రామికుల ప్రయోజనాల కోసం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) నిరంతర పోరాటాలు సాగిస్తోందని ఏఐటీయూసీ కొరాపుట్ జిల్లా కార్యదర్శి జుధిష్టర్ రౌళో అన్నారు. ఏఐటీయూసీ 107 వార్షికోత్సవాల సందర్భంగా జయపురం కార్మిక భవనంలో కార్మిక జెండాను ఆదివారం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కనీస అవసరాలు కల్పించేందుకు ఏఐటీయూసీ విరామం లేని ెపోరాటం సాగిస్తోందని వెల్లడించారు. కొరాపుట్ జిల్లాలో గనులు, అడవులు, భూమి, నీరు పెట్టుబడులుగా పెట్టి ప్రాజెక్టులు, విద్యుత్ సంస్థలు స్థాపించినా వాటి ప్రయోజనాలు కార్పొరేట్ సంస్థలే పొందుతున్నాయని ఆరోపించారు. స్థానిక ప్రజలకు కనీస ఉపాధి లేక ప్రతిరోజూ వందలాది మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులుగా వెల్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జయపురంలో పది వేల కుటుంబాలకు ఉపాధి కల్పించే సేవా పేపరు మిల్లు వెంటనే పునరుద్ధరించాలని కోరారు. దేశంలో నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్నా పాలకులు మొద్దునిద్ర వీడడం లేదని దుయ్యబట్టారు. సమావేశంలో ప్రమోద్ కుమార్ మహంతి, గుప్త సాగరియ, నంద హరిజన్, భువన కుమార్ తదితరులు పాల్గొన్నారు.


