అధికార యంత్రాంగం అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అధికార యంత్రాంగం అప్రమత్తం

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

భువనేశ్వర్‌: ఒకవైపు తుఫాన్‌, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలను ముమ్మరం చేసిన ఒడిశా ప్రభుత్వం.. మరోవైపు రానున్న వాతావరణ విపత్తును ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నవంబర్‌ 3 నాటికి ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటే అవకాశం ఉండటంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రమాదకర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, సహాయక శిబిరాలు, వైద్య సేవలు, తాగునీటి సదుపాయాలు సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. ఇటీవల తుఫాన్‌, వరదలతో ప్రభావితమైన జిల్లాల్లో ఇప్పటివరకు 75,855 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రత్యేక సహాయక కమిషనర్‌ (ఎస్‌ఆర్‌సీ) రాజేష్‌ ప్రభాకర్‌ పాటిల్‌ ఆదివారం వెల్లడించారు. బాధితుల కోసం 396 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 1,18,730 మంది ఈ విపత్తు బారినపడగా.. గంజాం, కంధమల్‌ జిల్లాల్లో తీవ్ర ప్రభావం కనిపించిందన్నారు. కంధమల్‌ జిల్లాలో ముగ్గురు మరణించగా, ముందస్తు తరలింపు చర్యల్లో భాగంగా 807 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వీరిలో 399 మందికి ప్రసవాలు జరిగినట్లు వివరించారు. ఈ విపత్తు కారణంగా 75,388 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 1,672 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. దక్షిణ ఒడిశాలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు 6,400 మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. బౌధ్‌, మల్కన్‌గిరి, రాయగడ జిల్లాలతోపాటు బరంపురం నగరంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా పునరుద్ధరించారు. దక్షిణ ఒడిశా పరిధిలో మొత్తంగా 96 శాతానికి పైగా విద్యుత్‌ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంది.

తాగునీటి సరఫరాపై దృష్టి

ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. బరంపురం నగరానికి రోజుకు అవసరమైన 90 మిలియన్‌ లీటర్ల నీటికి గాను ప్రస్తుతం 70 మిలియన్‌ లీటర్లు సరఫరా చేస్తున్నారు. మిగిలిన అవసరాన్ని తీర్చేందుకు 20 నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు. అలాగే 2,575 ట్యూబ్‌వెల్‌లు, 162 గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టులను శుద్ధి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రజలకు తాగునీటి సీసాలు, పౌచ్‌లను పంపిణీ చేస్తున్నారు. జానిబాలిలో నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు ఇసుక కట్ట నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో 120 మంది కార్మికులతోపాటు మూడు ఎర్త్‌మూవర్లను వినియోగిస్తున్నారు.

అల్పపీడనంపై అప్రమత్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నవంబర్‌ 3 నాటికి ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా యంత్రాంగం వాతావరణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తోంది. లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర తీర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విపత్తు ప్రతిస్పందన బృందాలను సిద్ధంగా ఉంచడంతోపాటు సహాయక శిబిరాలు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తెస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తక్షణ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

విపత్తుల వేళ ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి

75,855 మందికి సురక్షిత

ప్రాంతాల్లో ఆశ్రయం

396 సహాయక శిబిరాలు ఏర్పాటు: ఎస్‌ఆర్‌సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement