ఆదిత్యుని సన్నిధిలో గోవింద రామానుజ జీయర్‌ స్వామీజీ | - | Sakshi
Sakshi News home page

ఆదిత్యుని సన్నిధిలో గోవింద రామానుజ జీయర్‌ స్వామీజీ

Nov 2 2026 2:11 AM | Updated on Nov 2 2026 2:11 AM

అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి క్షేత్ర గోవింద రామానుజ జీయర్‌ స్వామీజీ ఆదివారం దర్శించుకున్నారు. ఆదిత్య క్షేత్రంలో స్వామి మూలవిరాట్టుకు నేరుగా పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో పాటు సూపరింటెండెంట్‌ వెంకటరమణ గౌరవ సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో స్వామీజీ శిష్యబృందం పాల్గొన్నారు.

ఇంకా ముంపులోనే

పంటపొలాలు

ఆమదాలవలస రూరల్‌: అన్నదాతను అర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం ఇంకా వెంటాడుతునే ఉంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు సాగునీటి కాలువలు పొంగి ప్రవహించటమే కాకుండా పంట పొలాలు నీటిలోనే మునిగి ఉన్నాయి. నాగావళి నది నీటి తీవ్రత పెరగటంతో నారాయణపురం ఆయకట్టు ఎడమ కాలువ పరిధిలో పలు కాలువలు పొంగి ప్రవహించటంతో పంటపొలాలు జలమయమయ్యాయి. ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశం లేకపోవడంతో పంట చేజారినట్టేనని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

చీడివలసలో ఇరువర్గాల ఘర్షణ

బూర్జ: చీడివలసలో వైఎస్సార్‌ సీపీ, టీడీపీ వర్గాలు ఆదివారం ఘర్షణకు దిగాయి. ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా రెండు పార్టీల ఆటోలు పరస్పరం తగలడంతో ఈ ఘటన చోటుచేసుకుందని వైఎస్సార్‌ సీపీ మాజీ సర్పంచ్‌ బూరి శ్రీరామమూర్తి, గ్రామస్తులు తెలిపారు. టీడీపీ శ్రేణులు విసిరిన రాయి వైఎస్సార్‌ సీపీకి చెందిన బోనెల రాజశేఖర్‌ (రాజు)కు తగలడంతో గాయమైనట్లు చెప్పారు. బాధితుడిని వెంటనే పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. ఎటువంటి తగాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గీతా సప్తాహం ప్రారంభం

శ్రీకాకుళం కల్చరల్‌ : నగరంలోని ఫాజుల్‌బాగ్‌పేటలో ఉన్న సద్గురు సాయి గీతా మందిరం ఆధ్వర్యంలో గీతాసప్తాహం ఆదివారం ప్రారంభమైంది. నెమలికొండ శాంతి ఆశ్రమం సదానంద స్వామీజీ, నిర్విషానంద స్వామి, చిన్మయానంద స్వామీజీ, శుభలక్ష్మీలు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫాజుల్‌బాగ్‌పేట, గుజరాతిపేట, బలగ, రాగోలు, చిలకపాలెం, పాతపట్నం, చెన్నాపురం, పెద్దబజారు, ఇప్పిలి వీధి నుంచి భక్తబృందాలు గీతాపారాయణ చేశారు. కార్యక్రమంలో శిమ్మన్న, గురపు కై లాసరావు, వెంకటరమణ, మధు, వైకుంఠరావు, వేణు, లక్ష్మీ, కమలకుమారి, పన్నాల నర్సింహమూర్తి, పార్నంది ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement