రాయగడ: గ్రామానికి సరైన రహదారి లేదు. కాలువపై వంతెన కూడా లేదు. దీంతో అనారోగ్యానికి గురైన ఓ మహిళను ఆస్పత్రికి తరలించేందుకు ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు మహిళను భుజాలపై మోసుకుంటూ కాలువ దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చారు. జిల్లాలోని గుడారి సమితి పంచపాండవ గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
కల్యాణ ఆశ్రమ సేవలు
ప్రశంసనీయం
జయపురం: జయపురం బక్షీ వీధిలో త్రినాత్ సేవా పరిషత్ అన్నపూర్ణ వనవాసీ కల్యాణ ఆశ్రమంలో బుధవారం బుద్ధి జీవి సమ్మేళనం నిర్వహించారు. వనవాసీ కల్యాణ ఆశ్రమం పట్టణ అధ్యక్షుడు శశిభూషణ పట్నాయిక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఒడిశా ప్రదేశ్ ముక్తి విశ్వవిద్యాలయ ప్రాంతీయ ప్రధాన అధికారి మహేంద్ర ప్రసాద్ సమాజ సేవి డాక్టర్ పరేష్ రథ్ తదితరులు హాజరయ్యారు. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రగతికి, సామాజిక సేవకు అందిస్తున్న సేవలను కొనియాడారు.
శ్రీముఖలింగం ఆలయంపై ఆకాశ దీపం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంపై బుధవారం ఆకాశ దీపం వెలిగించారు. ఈ ఆలయం పూర్వీకుల నుంచి ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వీయుజ మాసం గౌరీ పౌర్ణమి అనంతరం బహుళ పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఇలా ప్రతిరోజూ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాన్ని వెలిగిస్తారు. పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఒడిశా నుంచి భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు. అలాగే ఒడిశా ప్రజలు గౌరీ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసం పాటించి ఎక్కువగా దైవారాధనలో గడుపుతారు.
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
కంచిలి: సోంపేట నుంచి బారువ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం గుర్తించారు. మరణించిన వ్యక్తికి సుమారు 50 ఏళ్లు ఉంటాయి. మృతదేహం వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లభించలేదు. మృతుడు నీలం, నలుపు, తెలుపు రంగులు కలిగిన చెక్ షర్ట్, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడు. వివరాలు తెలిసినవారు 92475 85743 నంబర్‌ను సంప్రదించాలని రైల్వే పోలీసులు సూచించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
లావేరు: మండలంలోని బొడ్డపాడు వైఎస్సార్ కాలనీ వద్ద లావేరు రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీపురుపల్లి గ్రామానికి చెందిన మల్లు రవికుమార్ అనే వ్యక్తి సుభద్రాపురం వైపు ద్విచక్ర వాహనంతో వస్తుండగా.. బొడ్డపాడు వైఎస్సార్ కాలనీ వద్దకు చేరేసరికి బైక్‌కు కుక్క అడ్డంగా వచ్చింది. దీంతో పడిపోవడంతో బైక్‌పై ప్రయణిస్తున్న రవికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఈయనను 108 వాహనంలో చికిత్స నిమిత్తంగా రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.


